ప్రశాంతి నిలయం: సత్యసాయి సేవలను ప్రతిబింబిస్తూ ‘కవిం కవీనామ్’ పేరుతో నిర్వహించిన సంగీత నృత్యరూపకం భక్తులను అలరించింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ఏలూరు జిల్లా సత్యసాయి భక్తులు ఆదివారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయి యువత, బాలవికాస్ చిన్నారులు సత్యసాయి బోధనల ద్వారా మానవాళి పరివర్తనను, నిస్వార్థ సేవల ద్వారా సన్మార్గాన్ని చూపిన తీరును చక్కగా వివరించారు. అంతకుముందు ఉదయం సత్యసాయి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు చేతుల మీదుగా ఏలూరు జిల్లాలోని నిరుపేద రైతులకు ఉచితంగా వ్యవసాయ పరికరాలు అందజేశారు.


