గుర్తు తెలియని వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వృద్ధుడి మృతి

Aug 10 2026 1:52 AM | Updated on Aug 10 2026 1:52 AM

గుంతకల్లు రూరల్‌: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. గంగా నిలయం సమీపంలోని మరుగుదొడ్ల పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కూర్చుని ఉన్న వృద్ధుడు మృతిచెందినట్లు గుర్తించిన భక్తులు, ఆలయ సిబ్బంది వెంటనే కసాపురం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కొందరు యాచకులను విచారించగా మృతిచెందిన వృద్ధుడు రెండు నెలలుగా ఆలయ పరిసరాల్లోనే ఉంటున్నట్లు తెలిపారన్నారు. అయితే మృతి చెందిన మృతుడి వయసు సమారు 75 సంవత్సరాలకు పైగా ఉంటుందన్నారు. ఆచూకీ తెలిసిన వారు వెంటనే కసాపురం పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో వివాహిత..

ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో మల్లమ్మ (28) అనే వివాహిత మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బంధువుల వివరాల మేరకు.. ఆత్మకూరు మండలం పి.కొత్తపల్లికి చెందిన భార్యాభర్తలు హరికుమార్‌, మల్లమ్మతో పాటు వారి కుమారుడు యశ్విక్‌ ముగ్గురు ద్విచక్ర వాహనంలో అనంతపురానికి బయలుదేరారు. మల్లమ్మకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి చూపించాలనుకున్నారు. అయితే ఆత్మకూరు వద్దకు రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో మల్లమ్మ ఉన్నఫలంగా రోడ్డుపై పడింది. తలకు తీవ్ర గాయం అవ్వడంతో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రి సిబ్బంది అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. మల్లమ్మను అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు

గార్లదిన్నె: మండల పరిధిలోని ఎగువపల్లి సమీపంలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాలమేరకు... బత్తలపల్లి మండలం వెంకటగారి పల్లెకు చెందిన మురళీ, రమేష్‌, లోక్‌నాథ్‌, శివమ్మ, ఆదిలక్ష్మి తమ బంధువుల గ్రామమైన శింగనమల మండలం పెరవలికి వారం రోజుల క్రితం వెళ్లారు. బంధువులు సూరి, నారాయణలతో కలసి పామిడిలో నాటు వైద్యం కోసం అందరూ ఆదివారం తెల్లవారు జామున ఆటోలో పామిడికి బయలుదేరారు. అయితే ఎగువపల్లి వద్దకు రాగానే ఎదురుగా ఐచర్‌ వాహనం వచ్చి ఆటోను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆటోలోని ఏడుగురికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం అనంతపురము ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మురళీకి తీవ్రగాయాలు కావడంతో వైద్యులు బెంగళూరుకు రెఫర్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

లారీ డ్రైవర్‌ అనుమానాస్పద మృతి

తాడిపత్రి రూరల్‌: పట్టణ సమీపంలోని తేరన్నపల్లి క్రాస్‌ సమీపంలో లారీ డ్రైవర్‌ నాగేంద్ర (46) అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు తాడిపత్రి అప్‌గ్రేడ్‌ పోలీసుస్టేషన్‌ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన వివరాలమేరకు... నంద్యాల జిల్లా అవుకు మండల కేంద్రానికి చెందిన నాగేంద్ర 20 ఏళ్లుగా లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 2న గుండ్ల శింగవరం గ్రామానికి చెందిన క్లీనర్‌ రామకృష్ణారెడితో కలిసి మంగళూరుకు లారీ లోడ్‌ తీసుకొని వెళ్లారు. ఈనెల 8న భార్య వెంకటలక్ష్మికి నాగేంద్ర ఫోన్‌ చేసి కొందరితో గొడవ జరిగిందని ఫోన్‌లో చెప్పాడు. ఆమె భయంతో తాడిపత్రి అప్‌గ్రేడ్‌ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు నాగేంద్ర ఆచూకీ కోసం ప్రయత్నించినట్లు సీఐ పేర్కొన్నారు. అయితే తేరన్నపల్లి క్రాస్‌ వద్ద నాగేంద్ర శవాన్ని కొనుగొన్నామని తెలిపారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో చనిపోవడానికి అధిక మద్యం కారణమా, లేక లారీ యజమాని, క్లీనర్‌తో జరిగిన గొడవలో చనిపోయాడా అన్నది తేలాల్సి ఉందన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement