తనకల్లు: మండల కేంద్రంలో శనివారం శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాలు... చిన్నచెరువుపల్లికి చెందిన శ్రీనివాసులురెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్ రోడ్డులో సెల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం నల్లమాడకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా కత్తులు, కర్రలతో శ్రీనివాసులురెడ్డిపై దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసులు రెడ్డికి బలమైన గాయలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వస్తున్నారనే విషయం తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి ఉడాయించగా, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులురెడ్డిని చికిత్స కోసం తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి వంద మీటర్లలోపే పోలీస్‌స్టేషన్ ఉన్నా దండగులు కత్తులతో దాడి చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.


