సూర్యనారాయణుడి సేవలో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ | - | Sakshi
Sakshi News home page

సూర్యనారాయణుడి సేవలో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

Aug 9 2026 2:28 AM | Updated on Aug 9 2026 2:28 AM

ఉరవకొండ: రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన బూదగవి సూర్యనారాయణస్వామి దేవాలయాన్ని శనివారం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ కుటుంబ సమేతంగా సందర్శించారు. కలెక్టర్‌కు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి కలెక్టర్‌ దంపతులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్‌ చిరంజీవి, సుధా ఆధ్వర్యంలో కలెక్టర్‌ దంపతులను ఘనంగా సత్కరించారు. స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించి, తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఉరవకొండ తహసీల్దార్‌ అరుణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

● ప్రసిద్ధిగాంచిన పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి వారిని కూడా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యులు, సిబ్బంది స్వాగతం పలికారు. స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం కలెక్టర్‌ను ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందించారు.

వృద్ధుడి తలపై వెళ్లిన ఆర్టీసీ బస్సు

తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి

ధర్మవరం అర్బన్‌: ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తు తెలియని వృద్ధుడిపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తల చిధ్రమై మృతి చెందాడు. వన్‌ టౌన్‌ ఎస్‌ఐ ఇషాక్‌బాష తెలిపిన మేరకు.. ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులు బయటకు వచ్చే రోడ్డుపైన గుర్తు తెలియని వృద్ధుడు (70) శుక్రవారం అర్ధరాత్రి మద్యం తాగి నిద్రపోయాడు. శనివారం తెల్లవారుజామున పుట్టపర్తి డిపో ఆర్టీసీ బస్సు ఆ వృద్ధుడి తలపై వెళ్లింది. దీంతో అతని తల చిధ్రమై అక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న వన్‌ టౌన్‌ ఎస్‌ఐ ఇషాక్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడి ఆచూకి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఫారెస్టు అధికారులకు జింక అప్పగింత

బత్తలపల్లి: గాయపడిన జింకను బత్తలపల్లి పోలీసులు గుర్తించి ఫారెస్ట్‌ అధికారులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం బత్తలపల్లి సమీపంలో అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై జింక రోడ్డు దాటుకుంటోంది. ఇదే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో జింక గాయపడింది. సమాచారం అందుకున్న కానిస్టేబుల్‌ రామలింగ, హోంగార్డు పెద్దన్నలు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన జింకకు సపర్యలు చేశారు. అనంతరం ఫారెస్ట్‌ బీట్‌ కానిస్టేబుల్‌ అక్కులప్పకు సమాచారం అందించగా.. ఆయన బత్తలపల్లికి చేరుకుని జింకను స్వాధీనం చేసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఫారెస్ట్‌లో వదిలేస్తామని ఆయన తెలిపారు.

జూదరుల అరెస్టు

గోరంట్ల: మండల పరిధిలోని కొలిమిపల్లి శివారులో శనివారం 13 మంది జూదరులను అరెస్టు చేసినట్లు సీఐ బోయ శేఖర్‌ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.20,080 నగదుతో పాటు 5 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement