● ఉద్దేశ పూర్వకంగానే ఢీకొట్టారని పోలీసులకు ఫిర్యాదు
బత్తలపల్లి: మండల పరిధిలోని బత్తలపల్లి–వేల్పుమడుగు మార్గమధ్యంలో ద్విచక్రవాహనాన్ని మరో ద్విచక్రవాహనం వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో భార్య,భర్త తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వేల్పుమడుగు గ్రామానికి చెందిన దాసరి రాజు, ఆయన భార్య దాసరి సునీత శుక్రవారం మధ్యాహ్నం వ్యక్తిగత పనిమీద ద్విచక్రవాహనంపై బత్తలపల్లికి వస్తున్నారు. ఇదే సమయంలో గంటాపురం గ్రామానికి చెందిన బోయ అప్పస్వామి మరో ద్విచక్రవాహనంలో వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఉన్న మనస్పర్థలను దృష్టిలో ఉంచుకుని అప్పస్వామి ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. ఘటనలో వాహనం అదుపుతప్పి కిందపడటంతో రాజు, సునీతకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. చికిత్స అనంతరం శనివారం బాధితులు బత్తలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థిని అనుమానాస్పద మృతి
పావగడ: తాలూకాలోని రంగసముద్రం గ్రామంలోని కస్తూరిబాగాంధీ బాలికల పాఠశాల 8వ తరగతి విద్యార్థిని ప్రియాంక (13) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. కారనాగనహట్టి గ్రామానికి చెందిన శారదమ్మ, నరసింహమూర్తి దంపతుల కుమార్తె ప్రియాంక పాఠశాల శౌచాలయంలో మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. పాఠశాల హెచ్‌ఎం మృతురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం తెలియజేయగా.. దిగ్భ్రాంతికి గురైన వారు పాఠశాల వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు, తహసీల్దార్ వై.రవి, ఈఓ మధుసూదన్ పాఠశాల వద్దకు చేరుకుని పరిశీలించారు. ప్రియాంక మృతదేహాన్ని తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె మృతికి పాఠశాల వార్డెన్, హెచ్‌ఎంలే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.


