ఉద్యోగాల పేరుతో రూ.46 లక్షలకు టోకరా | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో రూ.46 లక్షలకు టోకరా

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

మంత్రి సత్యకుమార్‌

తెలుసని నమ్మించి డబ్బు వసూలు

నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చి యువతకు బురిడీ

గాజుల రాధపై

ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు

అనంతపురం సెంట్రల్‌: తాను గైనకాలజిస్టునని వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్‌నర్సు, ఎంఎల్‌టీ, అటెండర్‌, డీఈఓ తదితర ఉద్యోగాలిప్పిస్తానని ఓ మహిళ ఏకంగా రూ.46 లక్షలకు టోకరా వేసింది. తమకు న్యాయం చేయాలని బాధితులు శుక్రవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చి అదనపు ఎస్పీ నాగభూషణంకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన మేరకు.. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపాన ఓ గదిని అద్దెకు తీసుకొని గాజుల రాధ (భర్త సాకే హరి) ఉంటోంది. ఆమె మెడికల్‌ క్యాంపులు నిర్వహించే క్రమంలో కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, ధర్మవరం, బత్తలపల్లి, తాడిపత్రి, అనంతపురం, ఉరవకొండ, వజ్రకరూరు, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో కొందరు యువతీ యువకులను పరిచయం చేసుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ తనకు బాగా తెలుసని, తన అన్న కూడా ఆయన వద్ద పనిచేస్తున్నారని, విజయవాడ నుంచి జాబ్స్‌ ఇప్పిస్తామని చెప్పి 14 మంది నుంచి దాదాపు రూ.46 లక్షల దాకా వసూలు చేసింది. 8 నెలల తర్వాత అంటే రెండురోజుల క్రితం అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చింది. వాటిని తీసుకున్న వారు గురువారం డీఎంహెచ్‌ఓ కార్యాలయాన్ని సంప్రదిస్తే.. ఆ లెటర్లు నకిలీవని తెలిపారు. దీంతో తాము మోసపోయామని గ్రహించారు. గాజుల రాధ గురించి విచారణ చేయగా.. ఆమె గతంలో కూడా అంగన్‌వాడీ, డీఆర్‌డీఏలో ఉద్యోగాలిప్పిస్తానని, సదరం సర్టిఫికెట్లు మంజూరు చేయిస్తానని, గురుకుల పాఠశాలలో సీట్లు ఇప్పిస్తానని చెప్పి అనేక మందిని మోసం చేసినట్లు తెలిసింది. విచారణ చేపట్టి.. తమకు న్యాయం చేయాలని నిరుద్యోగులు అదనపు ఎస్పీని కోరారు.

టీబీ డ్యాంలో

68 టీఎంసీల నీరు

బొమ్మనహాళ్‌: తుంగభద్ర జలాశయంలో శుక్రవారం నాటికి 68.776 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. మంగళవారం 1,00,895, బుధవారం, 1,00,750, గురువారం 60,751 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో శుక్రవారం నాటికి 47,559 క్యూసెక్కులకు తగ్గింది. జలాశయం ఎగువ ప్రాంతాలైన మలెనాడు, శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్‌మగళూరు, వరనాడులో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద కూడా తగ్గుతూ వస్తోంది. రిజర్వాయర్‌ పూర్తి సామర్ధ్యం 1,633 అడుగులకు గాను ప్రస్తుతం 1,622.55 అడుగుల మేర నీటిమట్టం ఉంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1,626.06 అడుగులతో 80 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

హంద్రీ–నీవా సీఈ

నాగరాజ రాజీనామా

కడప సీఈ బాలచంద్రారెడ్డికి

ఇన్‌చార్జ్‌ బాధ్యతలు

అనంతపురం సెంట్రల్‌: హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ (సీఈ) పోస్టుకు కె.నాగరాజ రాజీనామా చేశారు. ఆయన లేఖకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జనవరి నెలాఖరున ఆయన హంద్రీ–నీవా సీఈగా ఉద్యోగ విరమణ పొందారు. అయితే జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు ఆయనే కావాలని పట్టుబట్టి మరీ పదవీకాలం పొడిగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఏడాదిపాటు ఆయన సేవలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో ఎప్పుడూ రిటైర్డు అయిన ఉద్యోగిని కొనసాగించలేదని, ఎలాంటి ఇబ్బందీ లేకుండా రూ.వేల కోట్ల హంద్రీ–నీవా లైనింగ్‌ పనుల బిల్లులు మంజూరు చేసుకోవడం కోసమే ఆయన్ను సీటులో ఉంచాలని ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఆయన నియామకం జరిగింది. అయితే ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన పనితీరుపై రాష్ట్ర ఉన్నతాధికారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రస్థాయి సమావేశంలో అన్ని జిల్లాల అధికారుల సమక్షంలో తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో నాగరాజ మనస్తాపం చెంది తాను కొనసాగలేనని రాజీనామా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదిస్తూ కడప చీఫ్‌ ఇంజినీర్‌ (ప్రాజెక్ట్స్‌) బాలచంద్రారెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశం జిల్లా జలవనరులశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement