పరిష్కారాలు మూరెడు | - | Sakshi
Sakshi News home page

పరిష్కారాలు మూరెడు

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

కదిరి అర్బన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఒక నియోజకవర్గం, ఒక నెల, నాలుగు పర్యటనలు ఇలా పేర్లు వేరైనా వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను అధికారులు, ప్రజాప్రతినిధులు స్వీకరిస్తున్నారు. అయితే సమస్యలు బోలెడు ఉన్నా... పరిష్కారం మాత్రం చాలా వాటికి చూపడం లేదన్న విమర్శలున్నాయి.

కదిరిలో ఒక నియోజకవర్గం కార్యక్రమం

ఒక నియోజకవర్గం, ఒక నెల, నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా కదిరి నియోజకవర్గంలో ప్రజా ఫిర్యాదుల వేదిక ప్రారంభించినట్లు జాయింట్‌ కలెక్టర్‌ మౌర్యా భరద్వాజ్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌తో కలిసి ఆయన ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహించి వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. తీసుకున్న అర్జీలు రెండో వారం, మూడో వారం పరిష్కరిస్తామని, నాలుగో వారం పరిష్కరించిన అర్జీలు అర్జీదారులకు అందజేస్తారని పేర్కొన్నారు.

పక్కా ఇళ్లు మంజూరు చేయండి

ప్రభుత్వం 2013లో కదిరి గ్రామ పొలం సర్వే నంబర్‌ 83లో గుట్టలో తమకు పట్టాలిచ్చారు. అందరం కలిసి కష్టపడి ఆ భూమిని చదును చేసుకున్నాం. ఆ స్థలాల్లో పక్కా ఇళ్లు మంజూరు చేయాలని ఖాధ్రీ దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో పలువురు దివ్యాగులు జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తమకు పక్కా ఇళ్లు నిర్మించుకునే స్థోమత లేదని వారు వాపోయారు. మరికొందరు దివ్యాంగులు కూడా సొంతిళ్లు లేక అవస్థలు పడుతున్నామని, పట్టాలు మంజూరు చేసి పక్కా ఇళ్లు మంజూరు చేయాలని వారు కోరారు.

కరువు మండలాలుగా ప్రకటించండి

జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం నాయకులు సుధాకర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, కృష్ణానాయక్‌, కరుణాకర్‌రెడ్డి తదితరులు వినతిపత్రం సమర్పించారు. ఉచితగడ్డి కేంద్రాలు, పశువులకు తాగునీటి తొట్టెలు ఏర్పాటు చేసి పాడిపశువులను కాపాడాలన్నారు.

ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి

కదిరిలో వేల సంఖ్యలో బీడీ కార్మికులు ఉన్నారని, వారికి ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ మౌర్యాభరద్వాజకు సీఐటీయూ నాయకులు నరసింహులు, ముస్తాక్‌, సుధాకర్‌రెడ్డి తదితరులు వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement