● చిత్తూరుపై అనంత జట్టు
ఘన విజయం
అనంతపురం: జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అనంత క్రీడాగ్రామం వేదికగా జరుగుతున్న ఏసీఏ సౌత్‌జోన్ మల్టీడే క్రికెట్ టోర్నీలో అర్టున్ టెండుల్కర్ వీరవిహారం.. బౌలర్ దీపక్ విజృంభణతో అనంత జట్టు విజయతీరాలకు చేరింది. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో భాగంగా ఏసీజీ మైదానంలో శుక్రవారం అనంతపురం, చిత్తూరు జట్లు తలపడ్డాయి. మొదటి ఇన్నింగ్స్‌లో చిత్తూరు జట్టు 196 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. 69 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్‌ను కొనసాగించిన అనంతపురం జట్టు 46.4 ఓవర్ల వద్ద 186 పరుగులకు ఆలౌట్ అయింది. పి. గిరినాథ్‌రెడ్డి 54 పరుగులు చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 32.5 ఓవర్ల వద్ద 155 పరుగులకు ఆలౌట్ అయింది. తేజారెడ్డి 58 పరుగులు, ధరణికుమార్ నాయుడు 53 పరుగులు తప్ప ఎవరూ రాణించలేదు. అనంత బౌలర్లలో ఎం.దీపక్ 42 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీశాడు. అనంతరం తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనంతపురం జట్లు 15.1 ఓవర్ల వద్ద ఒక్క వికెట్ కోల్పోయి 156 పరుగులు సాధించింది. బ్యాటర్ అర్జున్ టెండుల్కర్ 34 బంతుల్లో ఆరు ఫోర్లు, 8 సిక్సర్లతో వీరవిహారం సాగిస్తూ 82 పరుగులు సాధించాడు. దీంతో అనంత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అర్జున్ టెండుల్కర్
(82 పరుగులు)
దీపక్
(7 వికెట్లు)


