చిలమత్తూరు: ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో మట్టి మాఫియా పెట్రేగిపోతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చిలమత్తూరు మండలం స్వర్గధామంగా మారింది. మట్టి అక్రమ రవాణా చేస్తూ తమ ప్రైవేటు వెంచర్లకు వేలాది లోడ్ల మట్టిని తరలిస్తున్నారు. శుక్రవారం మండలంలోని మాదిరెడ్డిపల్లి సమీపంలో రియల్ ఎస్టేట్ చేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొనుగోలు చేసిన భూమిలో వ్యవసాయ అవసరాలకు అని అనుమతులు పొంది నిబంధనలకు పాతరేస్తూ అధికారుల కళ్లుగప్పేశారు. రెండెకరాలకు 300 ట్రాక్టర్ లోడ్ల అనుమతి తీసుకొని దాదాపు ఐదెకరాల పొలానికి ఐదువందలకు పైచిలుకు మట్టిని తోలారు. భూమిని రోడ్డుకు లెవెల్ చేసి వెంచర్ ఏర్పాటు చేసేందుకు మట్టి దందా సాగిస్తున్నారు. స్థానిక టీడీపీ నేతల అండదండలు ఉండటంతో ఇష్టారీతిన చెరువులో జేసీబీలను వినియోగించి మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇదే విషయంపై ఇరిగేషన్ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. వ్యవసాయ అవసరాలకు మాత్రమే తాము అనుమతులు ఇస్తున్నామని, వాటిని దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
మాదిరెడ్డిపల్లి దగ్గర
ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు


