బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లకు గౌరవ వేతనం మంజూరు | - | Sakshi
Sakshi News home page

బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లకు గౌరవ వేతనం మంజూరు

Aug 6 2026 8:14 AM | Updated on Aug 6 2026 8:14 AM

అనంతపురం అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)లో పాలుపంచుకున్న బీఎల్‌ఓలకు, 2021లో విధులు నిర్వర్తించిన సూపర్‌వైజర్లకు గౌరవ వేతనాన్ని ఎన్నికల సంఘం మంజూరు చేసింది. జిల్లాకు 1,69,20,000, శ్రీ సత్యసాయి జిల్లాకు రూ.1,19,80,000 విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఖాతాలో నిధులు జమ చేశారు. బీఎల్‌ఓకు రూ.7 వేలు, సూపర్‌వైజర్‌కు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనం నిర్ణయించారు. జిల్లాలో 2,226 మంది బీఎల్‌ఓలకు రూ.1,55,82,000, సూపర్‌వైజర్లు 223 మందికి 13.38 లక్షలు మొత్తం రూ.1,55,82,000, శ్రీ సత్యసాయి జిల్లాలో 1,576 మంది బీఎల్‌ఓలకు రూ.1,10,32,000, సూపర్‌వైజర్లు 158 మందికి రూ.9.48 లక్షలు మొత్తం రూ.1,19,870,000 విడుదల చేశారు.

పెద్దమ్మ ఆలయంలో చోరీ

బత్తలపల్లి: మండలంలోని అప్పరాచెరువు సమీపంలో ఉన్న పెద్దమ్మ ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి ఆలయంలోకి చొరబడిన దొంగలు అమ్మవారికి అలంకరించిన 13 తులాల వెండి ఆభరణాలు, ఉరుముల డబ్బు రూ.15 వేలు ఎత్తుకెళ్లారు. వెండి ఆభరణాల విలువ రూ.26 వేలు ఉంటుంది. ఈ విషయంపై ఆలయ పూజారి కొండారుపల్లి సతీష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ సోమశేఖర్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కరుణించు వరుణదేవా..

అమరాపురం: వరుణుడి కటాక్షం కోసం ప్రజలు వివిధ రకాలుగా ప్రార్థనలు చేస్తున్నారు. బుధవారం మండల పరిధిలోని తమ్మడేపల్లి పొలిమేరలో ఉన్న భూతప్పస్వామిని భక్తులు పూలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. వంటా వార్పు చేసి దేవునికి నైవేద్యం సమర్పించి భక్తులకు అన్నదానం చేశారు. వర్షం కురవకపోవడంతో పంటలు పండక, పశువులకు మేత దొరకక, తాగునీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తమ్మడేపల్లి, వీరాపురం, వలస గ్రామస్తులు పాల్గొన్నారు.

ఫొటో, వీడియోగ్రఫీపై ఉచిత శిక్షణ

పుట్టపర్తి టౌన్‌: కెనరా బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఫొటో, వీడియోగ్రఫీపై 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ శాంతిప్రియ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 50 సంవత్సరాలలోపు వారికి పుట్టపర్తి సమీపంలో బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న కార్యాలయంలో శిక్షణ ఉంటుదన్నారు. భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, నాలుగు పాస్‌ ఫొటోలు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు 9391486269, 08555–286427 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య

శెట్టూరు: మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ సుమన్‌ తెలిపిన మేరకు.. మండలంలోని లక్ష్మంపల్లికి చెందిన నాగభూషణ (45) ఈ నెల 2న తన భార్య లక్ష్మిని మద్యం తాగడానికి డబ్బు అడిగాడు. అప్పటికే అతను ఎక్కువగా మద్యం సేవించి ఉండటంతో డబ్బు ఇవ్వనని భార్య చెప్పింది. దీంతో తాను చనిపోతానంటూ భార్యను బెదిరించి ఇంటి నుంచి వెళ్లిపోయిన నాగభూషణ తిరిగి రాలేదు. చుట్టాల ఊరికి వెళ్లి ఉంటాడని భార్య భావించింది. ఈ క్రమంలోనే బుధవారం గ్రామానికి చెందిన బోయ బొజ్పప్ప పొలంలోని కంప చెట్లలో ఉరివేసుకుని నాగభూషణ మృతి చెందినట్లు గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సుమన్‌ పరిశీలించారు. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement