● ఎస్పీ సతీష్ కుమార్
పెనుకొండ రూరల్: సమస్య ఏదైనా సరే సంకోచించకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన కియా పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అనంతరం మునిమడుగు గ్రామంలో ఎస్పీ పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని, బాధితులకు అండగా నిలబడతామని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గృహ హింస, బెదిరింపులు, ఇతర ఇబ్బందులపై మహిళలు వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ రాఘవన్, ఎస్‌ఐ డి. రాఘవయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఫోటో రైటప్
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
పుట్టపర్తి టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా రక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. 10 మందికి రూ.లక్ష జరిమానా విధించగా, ఒక వ్యక్తిని 7 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామన్నారు. తనిఖీలు కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
10న ‘కేఎస్‌ఎన్’లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు వాక్–ఇన్
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక కేఎస్‌ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మ్యాథ్స్, కామర్స్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ప్రగతి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పీహెచ్‌డీ, నెట్, సెట్ అర్హతలు కలిగిన వారికి, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు కళాశాలలో నిర్వహించే వాక్–ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు.
యువతి బలవన్మరణం
శెట్టూరు: యువతి బలవన్మరణం పొందిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. వివరాలు.. శెట్టూరుకు చెందిన వడ్డే దైవాధీనం, లక్ష్మీదేవి దంపతులకు కుమార్తె జ్యోతి(37)తో పాటు ఒక కుమారుడు ఉన్నారు. జ్యోతి నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. ఇంట్లోనే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. చాలా సంవత్సరాలుగా కుమార్తెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరడం లేదు. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు.


