బత్తలపల్లి: మండల పరిధిలోని సూర్యచంద్రాపురం వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధుడిని కారు ఢీకొనడంతో మృతి చెందాడు. బత్తలపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. సూర్యచంద్రాపురం గ్రామానికి చెందిన గుజ్జల నారాయణ (74) స్థానికంగా చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం సరుకులు తీసుకొచ్చేందుకు ముదిగుబ్బకు బయలుదేరాడు. ఈ క్రమంలోనే రోడ్డు దాటుతున్న అతడిని అనంతపురం నుంచి ముదిగుబ్బ వైపు వెళ్తున్న టయోటా ఇన్నోవా కారు అతివేగంగా ఢీకొంది. దీంతో తీవ్రగాయాల పాలైన నారాయణను స్థానికులు ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని కుమారుడు ఆదినారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య నారాయణమ్మతో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
నివాళులర్పించిన కేతిరెడ్డి..
సమాచారం అందుకున్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సూర్యచంద్రాపురం చేరుకుని గుజ్జల నారాయణ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట ధర్మవరం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గొల్లపల్లి రామకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ గజ్జెల వెంగళరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ మాదిరెడ్డి జయరామిరెడ్డి, ఉపాధ్యక్షులు బ్యాల్ల పెద్దయ్య, నాయకులు చల్లా కృష్ణమనాయుడు, మంజుల రమణ, రవీంద్రనాయుడు, చిరంజీవి తదితరులు ఉన్నారు.


