లేపాక్షి: ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి తమ వంతు సేవ చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం లేపాక్షిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ లేపాక్షి నవోదయ విద్యాలయం విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. జూడో క్రీడలో 24 మంది జాతీయ స్థాయిలో ఆడడం ప్రశంసనీయమన్నారు. విద్య అంటే కేవలం పుస్తకాలను బట్టీ పట్టడమే కాదని, ఆలోచించడం, విశ్లేషించడం, కొత్త ఆవిష్కరణలు చేయడమే అసలైన విద్య అని పేర్కొన్నారు. గురువులతో పాటు సమాజంలో సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని సూచించారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలన్నారు. అనంతరం విద్యాలయంలో 10వ తరగతి విద్యార్థులు కే.లాస్యరెడ్డి, కే.కిరణ్‌తేజ, యస్.అభిరాం, వై.స్నేహలత, ఇంటర్ విద్యార్థులు యస్.చిత్రలేఖ, పి.హేమలత, ఎన్.కార్తీక్‌సాయిని సత్కరించారు. విద్యార్థులు చేపట్టిన యోగాభ్యాసాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగరాజు, నాసిన్ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ బట్నా కృష్ణారావు, ఎంఈఓ నాగరాజు, అల్యూమిని సభ్యులు వేమనారాయణ, డాక్టర్ వెంకటరమణ, రాజారెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపు


