పుట్టపర్తి అర్బన్: పచ్చి రొట్ట ఎరువులైన జీలుగ, జనుము, పిల్లి పెసర, ఉలవ నేలకు ఎంతో మంచి చేస్తాయి. నేల భౌతిక స్థితిని, స్థూల, సూక్ష్మ సాంద్రతను మారుస్తాయి. నీటి నిల్వ శక్తిని పెంచడంతో పాటు గాలిలో ఉండే నత్రజనిని స్థిరీకరిస్తాయి. పైపాటుగా వేసే 25 శాతం నత్రజని ఎరువులు తగ్గించుకోవచ్చు. భూమిలో వేరు బుడిపెలతో సారం పెరుగుతుంది. ఎరువులు వేసినప్పుడు నత్రజని, పొటాషియం, భాస్వరం మాత్రమే అందితే పచ్చిరొట్ట ఎరువులతో మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు అందుతాయి. భూముల్లో చౌడును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నేలలో మంచి బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు, వానపాముల పెంపునకు అనుకూలించి భూమి ఆరోగ్యాన్ని పెంచుతాయి.
జీలుగతో సరిపెట్టిన సర్కారు..
గత ప్రభుత్వంలో పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు 50 శాతం సబ్సిడీతో అందించేవారు. అప్పట్లో వాతావరణం అనుకూలించడంతో ఏటా 3 వేల క్వింటాళ్లకు పైగా పచ్చిరొట్ట విత్తనాలను రైతులు కొనుగోలు చేసేవారు. ఈసారి చంద్రబాబు ప్రభుత్వం కేవలం జీలుగ మాత్రమే అందజేయడంతో రైతులు 160.5 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. వీటి పూర్తి ధర కిలో రూ.80 కాగా 50 శాతం సబ్సిడీతో రూ.40 చొప్పున అందజేశారు. అన్ని విత్తనాలు అందజేయకుండా కేవలం జీలుగతోనే సరిపెట్టడంపై రైతులు పెదవివిరుస్తున్నారు.
పచ్చిరొట్ట ఎరువులతో
అనేక ప్రయోజనాలు
భూసారం పెంచుకోవచ్చు
జీలుగతోనే సర్కారు సరిపెట్టడంపై రైతుల పెదవివిరుపు
పచ్చిరొట్ట విత్తనాలను ఎకరాకు 10 కిలోల చొప్పున చల్లుకోవాలి. సాగు చేసిన నెలన్నర వరకూ భూమిలోకి కలయదున్నాలి. ముఖ్యంగా వరి పైరు పోయగానే పచ్చిరొట్ట విత్తనాలు చల్లి పైరు నాటడానికి సిద్ధం కాగానే కలయ దున్నవచ్చు. ఇది నీటి కింద పడిపోయి రెండు వారాల్లో ఎరువుగా మారిపోతుంది. మెట్ట భూముల్లో అయితే, సాగు చేసిన పచ్చిరొట్టను కోసి కంపోస్ట్ చేసిన తరువాత పంటలకు వినియోగించాలి. రోటావేటర్‌తో కలయ దున్నడంతో పంట సాగులో పుల్లలు అడ్డం వచ్చే పరిస్థితి ఉంటుంది. పచ్చి రొట్ట ఎరువులను ఉద్యాన పంటలకూ ఉపయోగించవచ్చు. సాగు చేసి పెరిగిన తరువాత జీలుగ జనుమును కోసి మొక్కల చుట్టూ గుంతలు తీసి అందులో వేసి మట్టి కప్పితే ఎరువుగా మారి మొక్కలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.


