మ్యాన్‌ ఆఫ్‌ మంత్‌ అవార్డుల ప్రదానం | - | Sakshi
Sakshi News home page

మ్యాన్‌ ఆఫ్‌ మంత్‌ అవార్డుల ప్రదానం

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

గుంతకల్లు: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల నివారణకు కృషి చేసిన పలువురు ఉద్యోగులకు మంగళవారం మ్యాన్‌ ఆఫ్‌ మంత్‌ అవార్డులను డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా ప్రదానం చేశారు. ఎర్రగుంట్లకు చెందిన ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శ్రీనివాసులు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గోవిందప్ప, కానిస్టేబుల్‌ ఎస్‌. వెంకటరెడ్డితోపాటు గుంతకల్లు ట్రైనీ మేనేజర్‌ సురేష్‌బాబు, పాయింట్స్‌మెన్‌లు జ్యోతీ ప్రతాప్‌ (ఎర్రగుడిపాడు), వై.పురుషోత్తం (గుత్తి), ఎం.శ్రీహరి (స్టేషన్‌ మాస్టర్‌, అనంత రాజుపేట), మల్లేషన్‌ (టెక్నీషియన్‌–3,మంత్రా లయం)కు అవార్డులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కారు ఢీకొని యువకుడి మృతి

పెనుకొండ రూరల్‌: కారు ఢీ కొని యువకుడు మృతి చెందిన సంఘటన పెనుకొండ వద్ద 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కియా పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ డి. రాఘవయ్య తెలిపిన మేరకు.. చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామానికి చెందిన ఉపేంద్ర (20) పెనుకొండ మండలం అమ్మవారిపల్లిలోని కోకాన్‌ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం పని ముగిసిన అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న అతడిని ఓ కారు వేగంగా ఢీకొంది. దీంతో తీవ్రగాయాలైన ఉపేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి నాగభూషణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆలయంలో వెండి

ఆభరణాల అపహరణ

కనగానపల్లి(చెన్నేకొత్తపల్లి): చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని వెంకటంపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. వెంకటంపల్లి నడిబొడ్డున ఆంజనేయస్వామి ఆలయం ఉంది. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ తలుపు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. స్వామివారికి అలంకరించిన 30 తులాల వెండి కిరీటం, 20 తులాల వెండి మలతాడు, హస్తం ఎత్తుకెళ్లారు. ఆలయం వద్ద సీసీ కెమెరాలు ఉన్నా వాటికి చిక్కకుండా చోరీకి పాల్పడటం గమనార్హం. దీనిపై మంగళవారం చెన్నేకొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.

బాండ్‌ షరతుల ఉల్లంఘన.. వ్యక్తికి రిమాండ్‌

కదిరి టౌన్‌: భద్రతా బాండ్‌ షరతులను ఉల్లంఘించిన వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. మంగళవారం కదిరి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. కదిరికి చెందిన షేక్‌ వలిబాషా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతను బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 126 కింద సంవత్సరం పాటు మంచి ప్రవర్తనతో నడుచుకుంటానంటూ రూ.5 లక్షల విలువైన భద్రతా బాండ్‌ సమర్పించాడు. బాండ్‌ అమలులో ఉండగానే కదిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ హత్య కేసులో తలదూర్చాడు. పోలీసులు పోకాజ్‌ నోటీస్‌ ఇచ్చినా స్పందించలేదు. బాండ్‌ మొత్తం కూడా చెల్లించలేదు. దీంతో షేక్‌ వలిబాషాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి కదిరి సబ్‌ జైలులో 65 రోజుల రిమాండ్‌కు పంపారు. కార్యక్రమంలో కదిరి టౌన్‌ సీఐ బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

‘కేఎస్‌ఎన్‌’లో 11 వరకు డిగ్రీ ప్రవేశాలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: స్థానిక కేఎస్‌ఎన్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగనున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం. ప్రగతి తెలిపారు. ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణంలో విద్యను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధనతో పాటు ఆధునిక ప్రయోగశాలలు, విశాలమైన గ్రంథాలయం, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, డిజిటల్‌ తరగతి గదులు, కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యా ర్థినులకు అందుబాటులో ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement