పిల్లలను హెచ్‌ఎం కొడుతోందని టవర్‌ ఎక్కిన తండ్రి | - | Sakshi
Sakshi News home page

పిల్లలను హెచ్‌ఎం కొడుతోందని టవర్‌ ఎక్కిన తండ్రి

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

తలుపుల: తన పిల్లలను పాఠశాల హెచ్‌ఎం నిత్యం కొడుతోందంటూ ఓ తండ్రి సెల్‌టవర్‌ ఎక్కాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మండలంలోని పెద్దన్నవారిపల్లికి చెందిన ఓబులపతి పిల్లలు వర్షిత, శశివర్దన్‌లు అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. స్కూల్‌ హెచ్‌ఎం హేమలత రోజూ వీరిని కొడుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఎంఈఓ వెంకట్రాముడుకు ఓబులపతి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ మంగళవారం స్థానిక ఓబీఆర్‌ రోడ్డులోని సెల్‌ టవర్‌ ఎక్కాడు. ఏఎస్‌ఐ వెంకటగిరి, కానిస్టేబుల్‌ రమేష్‌లు అక్కడికి చేరుకుని ఓబులపతికి నచ్చజెప్పి కిందికి దించారు. స్టేషన్‌లో ఎస్‌ఐ చెన్నయ్య కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు.

సద్దుమణిగిన గొడవ

పుట్టపర్తి అర్బన్‌: వైద్యులు, ఉద్యోగ సంఘాల మధ్య జరుగుతున్న గొడవ ఎట్టకేలకు సద్దుమణిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో వైద్యులు, ఉద్యోగ సంఘాలకు మధ్య గొడవలు మంచిది కాదంటూ బలవంతంగా సారీ చెప్పించి ఒప్పించడం గమనార్హం. తనను ఉద్యోగ సంఘాల నాయకులు లింగా రామమోహన్‌, మరో వ్యక్తి చంపుతానని బెదిరించారంటూ పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు ఆస్పత్రి వైద్యుడు దిలీప్‌ కుమార్‌ సోమవారం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నాలుగు రోజుల క్రితం స్టాఫ్‌ నర్సులతో మొదలైన గొడవ చంపుతామంటూ బెదిరించే వరకూ వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో డాక్టర్‌ దిలీప్‌ కుమార్‌పై కేసు నమోదు చేయించాలని ఉద్యోగ సంఘాల నాయకులు చర్చలు జరిపారు. దీనిపై మంగళవారం రాత్రి డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫైరోజా బేగం దిలీప్‌ కుమార్‌, ఉద్యోగ సంఘాల నాయకులను పిలిపించి మాట్లాడారు. డాక్టర్‌కు ఉద్యోగ సంఘాల నాయకులతో సారీ చెప్పించడంతో ఆయన చల్లబడ్డారు.

రేపటి నుంచి పాదయాత్రలు

సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్‌

కదిరి టౌన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రచార పాదయాత్రలు చేపడుతున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్‌ తెలిపారు. మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్‌ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమ వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం వేమయ్యయాదవ్‌ మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలు ఇచ్చి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టారన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కులమతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను శాసిస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీ విధానాలను నిరసిస్తూ తాము నిర్వహించే ప్రచార జాతాలు, పాదయాత్రలు, చలో ఢిల్లీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రజలను ఏకం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు పవన్‌, కదిరప్ప, మధునాయక్‌, లియాఖత్‌, హాసన్‌, అంజన్‌బాబు, ఈశ్వరయ్య, మనోహర్‌, రమణ, రవి, రెడ్డప్ప, హనుమంతరెడ్డి, ముబారక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement