బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి దుర్మరణం

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

ముదిగుబ్బ: బైకును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్‌ కడప జిల్లా లింగాల మండలం అంబకపల్లికి చెందిన మందుగుండు కమలాకర్‌ (55) వ్యాపార నిమిత్తం ముదిగుబ్బకు వచ్చి స్థిరపడ్డాడు. స్థానికంగా కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మంగళవారం ఉదయం దొరిగిల్లు రోడ్డు సమీపంలో ఉన్న వ్యవసాయ తోటకు వెళ్లి ద్విచక్ర వాహనంలో తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో పులివెందుల డిపో ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా ఢీకొంది. ప్రమాదంలో కమలాకర్‌ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య రేణుక, కుమారుడు సాయి నవీన్‌, కుమార్తె దివ్యశ్రీలు ఉన్నారు.

15 మంది బైండోవర్‌

తలుపుల: తహసీల్దార్‌ ఎదుట 15 మందిని పోలీసులు బైండోవర్‌ చేశారు. మండలంలోని మామిళ్లవారిపల్లికి చెందిన ఇరువర్గాలు తాగునీటి పైప్‌లైన్‌ విషయమై మంగళవారం గొడవ పడ్డారు. ఈ క్రమంలో భవిష్యత్‌లో మళ్లీ గొడవ పడకుండా ఇరువర్గాలకు చెందిన 15 మందిని ఎస్‌ఐ చెన్నయ్య తహసీల్దార్‌ మురళీకృష్ణ వద్ద బైండోవర్‌ చేశారు. గ్రామాల్లో ఎవరూ గొడవ పడవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా

కదిరి టౌన్‌: మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా తప్పదని కదిరి పట్టణ సీఐ బి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం పట్టణంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించి ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.60,000 జరిమానా విధించారన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని కోరారు.

పురంలో ముగ్గురికి జరిమానా..

హిందూపురం: మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురికి హిందూపురం రూరల్‌ అప్‌గ్రేడ్‌ పోలీసులు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.30 వేల జరిమానా విధించారు. ఎస్పీ సతీష్‌ కుమార్‌, ఏఎస్పీ కేవీ మహేష్‌ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హిందూపురం రూరల్‌ పరిధిలోని బిసలమానేపల్లి వద్ద రోడ్డు భద్రతను మెరుగుపరిచే ఉద్దేశంతో జాతీయ రహదారిలో ట్రాఫిక్‌ డ్రమ్‌లను ఏర్పాటు చేసినట్లు సీఐ జనార్దన్‌ పేర్కొన్నారు. వాహనదారులు నిర్దేశిత వేగ పరిమితులను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement