ధర్మవరం రూరల్: మల్బరీ సాగులో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులను సాధించవచ్చునని అనంతపురం పట్టు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వీఎస్ రమ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రేగాటిపల్లిలో ‘నా పట్టు–నా అభిమానం 2.0’ కార్యక్రమంలో భాగంగా మల్బరీలో సమగ్ర కీటక, వ్యాధి నిర్వహణపై సాంకేతిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పట్టు శాఖ సంయుక్త సంచాలకురాలు శోభారాణి, ధర్మవరం సహాయ సంచాలకురాలు రాజేశ్వరి, పట్టు అభివృద్ధి అధికారి దామోదర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్బరీలో ప్రధాన కీటకాలు, వ్యాధుల ఉత్పత్తి కారణాలు, వాటి ఆర్థిక ప్రాధాన్యం, శాసీ్త్రయ నివారణ, నిర్వహణ పద్ధతులపై రైతులకు ఆమె అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైతులు అధికంగా ఎదుర్కొంటున్న వేరుకుళ్లు వ్యాధి గురించి వివరించారు. నేలలో సేంద్రియ కార్బన్ శాతాన్ని పెంచేందుకు సేంద్రియ ఎరువులను వినియోగించాలన్నారు. వేరు కుళ్లు వ్యాధి సమగ్ర నివారణకు సాఫ్ రెండు గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్కల అడుగు భాగంలో ద్రావణాన్ని పోయాలన్నారు. 10 రోజుల వ్యవధిలో మరో సారి కూడా పోయాలన్నారు. మూడో విడవ విడతలో మిస్టర్ ప్రో లీటర్ నీటికి 5 మి.లీ కలిపి వ్యాధి సోకిన ప్రతి మొక్కకు 10 లీటర్ల ద్రావణం, అలాగే ఆరోగ్యకరమైన ప్రతి మొక్కకు 5 లీటర్ల ద్రావణాన్ని నేలపై పోయాలన్నారు. పలువురు పట్టు రైతులు తమ సందేహాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో ఉత్తమ రైతు చంద్రశేఖర్‌రెడ్డి, మల్బరీ రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పట్టు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వీఎస్ రమ్య


