వాతావరణానికి అనుగుణంగా పంటలు వేయాలి | - | Sakshi
Sakshi News home page

వాతావరణానికి అనుగుణంగా పంటలు వేయాలి

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

రొళ్ల: ఎల్‌నినో నేపథ్యంలో వాతావరణానికి అనుగుణంగా రైతులు పంటలు సాగు చేసుకోవాలని అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్‌ లక్ష్మీకల్యాణి, డాక్టర్‌ వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం రొళ్ల మండల పరిధిలోని బీజీ హళ్లి, హొట్టేబెట్ట, రత్నగిరి, గుడ్డగురికి, హులికుంట తదితర గ్రామాల్లో వేరుశనగ, రాగి, కంది, మొక్కజొన్న, ఉలవ పంటలను ఏఓ వెంకటబ్రహ్మంతో కలిసి పరిశీలించారు. రైతులకు అవగాహన కల్పించారు. ఎర్రనేలల్లో పంటపై 15 రోజులకు ఒకసారి 5 శాతం పొటాషియం నైట్రేట్‌ పిచికారీ చేసుకోవాలన్నారు. వేరుశనగ, కంది, మొక్కజొన్న, రాగితో పాటు ఉలవలు బెట్ట పరిస్థితులను తట్టుకోవడానికి రక్షక తడులు ఇవ్వాలన్నారు. వాలుగా దున్నడం, అంతర కృషి చేయడం వల్ల నీళ్లు వృథా కాకుండా భూమిలోకి ఇంకిపోతాయని తెలియజేశారు. భూమిలో తగినంత తేమ దొరికే వరకు ఎరువుల వాడకాన్ని నిలిపివేయాలన్నారు. సాధ్యమైనంత వరకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు వేసుకోవాలన్నారు. పంటసాగులో ఎదురయ్యే సమస్యలను స్థానికంగా ఉన్న వ్యవసాయశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి పరిష్కరించుకోవాలన్నారు. పంట వివరాలను ఈ క్రాప్‌ బుకింగ్‌ చేయించుకోవాలన్నారు. పంట సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడి సాధించాలని తెలియజేశారు. కార్యక్రమంలో సోమసుందర్‌, ఎస్‌జేవీ సూర్యతేజ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement