అమరాపురం: మండల పరిధిలోని పుల్లీకుంట గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో రెండు గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో రూ.నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. బాధితులు నందీష్, రత్నమ్మ వివరాల మేరకు... పుల్లీకుంట ఇందిరమ్మ కాలనీలో గుడిసెలో నందీష్, రత్నమ్మ నివాసం ఉంటున్నారు. యథావిధిగా శనివారం రాత్రి భోజనం తరువాత నిద్రకు ఉపక్రమించారు. ఆదివారం తెల్లవారు జామున ఉన్నఫలంగా మంటలు చెలరేగిన శబ్ధం వినిపించింది. వెంటనే భార్యా పిల్లలతో పాటు బయటికి వచ్చి చూడగా గుడిసె అగ్గి రాజుకొని మంటలు చెలరేగాయి. దీంతో ఇరుగు పొరుగు వారిని పిలిచే లోపు మొత్తం గుడిసె కాలి పోయిందని బాధితులు వాపోయారు. ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.90 వేలు నగదు, భార్య తిప్పమ్మకు చెందిన బంగారు నగదు, వంట సామగ్రి, వస్తువులు కాలిపోయాయని వాపోయారు. దీంతో రూ.4 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగిందన్నారు. అలాగే తమ ఇంట్లో అగ్గి రాజుకుని పొరుగున ఉన్న రత్నమ్మ నివాసం ఉంటున్న వారుపాక పూర్తిగా కాలిపోయిందన్నారు. దీంతో రూ. 50 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితురాలు రత్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందా.. లేక ఎవరైనా నిప్పుపెట్టారా.. అన్నది తేలాల్సి ఉంది. అధికారులు స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఘటనా స్థలాన్ని విద్యుత్‌శాఖ ఏఈ సిద్దేశ్వర పరిశీలించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరగలేదని, ఇంటిలోనే దీపం వెలిగి కాలి ఉండవచ్చని ఏఈ తెలిపారు.


