హిందూపురం టౌన్: ఎస్సీ వర్గీకరణ కారణంగా మాల సామాజిక వర్గం ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చట్టపరమైన మార్పులు జరిగే వరకు దేశవ్యాప్తంగా శాంతియుత ఉద్యమాన్ని కొనసాగిస్తామని మాల మహానాడు, రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు బీజం కాంగ్రెస్ పార్టీ వేయగా, దేశవ్యాప్తంగా అమలు చేసే పరిస్థితిని నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్ల వల్ల వందలో ఒక్కరికే ప్రయోజనం చేకూరుతుందని, అదే రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఎస్సీ ఉపకులాలకు, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఎస్సీ వర్గాలకు ఆయా సీఎంలు సామాజిక న్యాయం, సమన్యాయం పేరుతో ఎలా సమానంగా పంచుతారని ప్రశ్నించారు. సామాజిక న్యాయం పేరుతో దళితుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. దేశ సంపద పంపిణీ, మంత్రి పదవులు, అధికారంలో భాగస్వామ్యం వంటి అంశాల్లోనూ సామాజిక న్యాయం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గానికి రాజకీయంగా అన్యాయం జరుగుతోందని, ఈ అంశంపై మాల ప్రజాప్రతినిధులు మౌనం వీడాలని కోరారు. మాల సామాజిక వర్గ ప్రజలు శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యమని అన్నారు. సమావేశంలో జూలుకుంట కేశవ్ ప్రసాద్, గొల్లపల్లి గోవిందప్ప, నరేష్, అరవింద్ కుమార్, యాదయ్య, కాశయ్య, నారాయణ, విజయ్ కుమార్, నరహరి, నానీ, చిన్నా తదితరులు పాల్గొన్నారు.
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్‌ఎస్ రత్నాకర్


