సప్త అశ్వాలపై విశ్వాన్ని శాసించే సూర్యుడినే వాహనంగా చేసుకుని పగలు... రేయి రాజైన చంద్రున్ని వాహనంగా చేసుకుని రాత్రి వేళ ఖాద్రీశుడు భక్తులకు దర్శనమిచ్చారు. సర్వమూ తానేనని చాటుతూ మాఢవీదుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిదవ రోజైన శుక్రవారం స్వామివారు పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై ఊరేగుతూ తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. లోకంలో పుట్టడం, పెరగడం, నశించడం అనే మూడు ప్రక్రియలు కాలాధీనాలు. ఆ కాల స్వరూపుడిని తానే అంటూ చాటి చెబుతూ స్వామివారు సూర్య, చంద్ర ప్రభలను అధిష్టించి దర్శనమిచ్చారు. సూర్య మండల మధ్యస్తుడైన శ్రీ మహా విష్ణువుకు నారాయణుడని పేరు. పగటికి సూర్యుడు రారాజైతే, రేయికి చంద్రుడు అధిపతి. సృష్టికి ఎంతో ముఖ్యమైన ఈ రేయింబవళ్లను శ్రీమహావిష్ణువు రెండు కళ్లుగా కలిగివుండి, వాటినే వాహనాలుగా మార్చుకుని సృష్టిలో సర్వమూ తానే అని చాటిచెబుతూ తిరువీధుల్లో దర్శనమిచ్చినట్లు అర్చక పండితులు తెలిపారు. ఉత్సవం ఉభయదారులుగా అంబే శ్రీరామమూర్తి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు.
నేడు మోహినీ ఉత్సవం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి శనివారం మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. పాల కడలిని మదించి అందులో ఉద్భవించిన అమృతాన్ని సేవించడానికి దేవతాసురులు పోటీ పడతారు. ఆ అమృతాన్ని పంచడానికి శ్రీమహా విష్ణువు మోహినీ అవతారమెత్తారు. దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి, అసురులను మభ్యపెట్టేందుకు శ్రీవారు ఈ అవతారాన్ని ధరిస్తారని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలోనే కాకుండా తిరువీధుల్లో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆలయంలో రోజంతా నిత్యాన్నదానం కొనసాగుతోంది.
రథోత్సవానికి ఏర్పాట్లు..
ఈ నెల పదో తేదీన జరగనున్న ఖాద్రీశుడి రథోత్సవానికి ఆలయ అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. రథానికి కప్పిన రేకులు తొలగించి అగ్నిమాపక శాఖ అధికారుల సాయంతో నీటితో శుభ్రం చేశారు. రథం లాగేందుకు మోకులు, తెడ్లు సిద్ధం చేస్తున్నారు. తిరువీధుల్లో దుకాణాల ముందున్న రేకులను తొలగించాలని యజమానులకు సూచించారు. రథం లాగేటప్పుడు భక్తులు ఇబ్బంది పడకుండా తిరువీధుల్లో రోడ్డుకు ఇరువైపులా కాలువలపై రాతికప్పులు వేయిస్తున్నారు.
సూర్య, చంద్రప్రభ వాహనాలపై
నారసింహుడి విహారం
స్వామివారి దర్శనానికి
పోటెత్తిన భక్త జనం


