‘సర్వేయర్ల పోరుబాట’లో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

‘సర్వేయర్ల పోరుబాట’లో ఉద్రిక్తత

Mar 7 2026 9:31 AM | Updated on Mar 7 2026 9:31 AM

ప్రశాంతి నిలయం: కనీస వేతనం, సస్పెండ్‌ చేసిన సర్వేయర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం తదితర న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా చేపట్టిన సర్వేయర్ల ధర్నాలో ఉద్రిక్తత నెలకొంది. దశల వారీ ఉద్యమంలో భాగంగా సర్వేయర్లు ఇప్పటికే ఉద్యోగ విధులకు సంబంధించి వాట్సాప్‌ గ్రూపుల నుంచి స్వచ్ఛందంగా తొలగిపోయారు. డిమాండ్ల సాధన కోసం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సర్వేయర్లు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్వర్ణ గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్‌ నాయుడు మాట్లాడుతూ... ఇప్పటికే పలుమార్లు ధర్నాలు చేసినా, నిరసనలు తెలిపినా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తమకు న్యాయం చేసే వరకూ ఉద్యమం కొనసాగిస్తామన్నారు. జనవరి 21వ తేదీనే తాము సహాయ నిరాకరణ చేస్తే రెవెన్యూ శాఖ మంత్రి స్పందించి చర్చలకు పిలిచారన్నారు. రీ సర్వే తప్పిదాలకు తమను బాధ్యులను చేయడం తగదన్నారు. బేసిక్‌ పే రూ.30 వేలు చేయాలని, సస్పెండ్‌ చేసిన సర్వేయర్లను తిరిగి విఽధుల్లోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సురేష్‌, కృష్ణారెడ్డి, బాలాజీ నాయక్‌, ఆనంద మంజునాథ్‌, బాలచంద్రా నాయక్‌, హరీష్‌, చేతన్‌, రాధిక తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఐపై తిరగబడ్డ సర్వేయర్లు ..

శాంతియుత ధర్నా చేస్తున్న సర్వేయర్లు కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసన తెలిపేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంలోనే ఎస్‌ఐ క్రాంతి సర్వేయర్ల సంఘం నాయకులపై పరుష పదజాలం ఉపయోగించడమే కాకుండా వారిని అక్కడి నుంచి తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో సర్వేయర్లు తిరగబడ్డారు. పోలీసులు, సర్వేయర్లు ఒకరినొకరు తోసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో డీఎస్పీ విజయ కుమార్‌ వెంటనే అక్కడకు చేరుకుని వారికి సర్ది చెప్పారు. కనీసం తమగోడు చెప్పుకునేందుకు కూడా స్వేచ్ఛ లేదా అంటూ పలువురు సర్వేయర్లు ఆయన్ను నిలదీశారు. పోలీసులు ఉద్దేశ పూర్వకంగా తమను ఇబ్బంది పెడుతున్నారన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట నల్లబ్యాడ్జీలతో

శాంతియుత నిరసన

అడ్డుకున్న పోలీసులు..

దురుసుగా ప్రవర్తించిన ఎస్‌ఐ

న్యాయం జరిగేవరకూ

పోరుబాట వీడబోమన్న సర్వేయర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement