మొలకలచెరువులో స్టాపింగ్‌కు అనుమతి | - | Sakshi
Sakshi News home page

మొలకలచెరువులో స్టాపింగ్‌కు అనుమతి

Mar 7 2026 9:31 AM | Updated on Mar 7 2026 9:31 AM

గుంతకల్లు: తిరుపతి – అంకోలా మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మొలకలచెరువు రైల్వేస్టేషన్‌లో ఒక్క నిమిషం స్టాపింగ్‌కు అనుమతులు ఇచ్చినట్లు రైల్వే డివిజన్‌ అధికారులు తెలిపారు. గుంతకల్లు డివిజన్‌ పరిధిలోని కదిరి– మదనపల్లి రోడ్డు సెక్షన్‌లో మొలకలచెరువుకు తిరుపతి – అంకోలా (07605) ఎక్స్‌ప్రెస్‌ రైలు మధ్యాహ్నం 2.49 గంటలకు చేరుకుంటుందన్నారు. అలాగే అంకోలా నుంచి తిరుపతి (07606) ఎక్స్‌ప్రెస్‌ రైలు అర్ధరాత్రి 02.34 గంటలకు చేరుతుందన్నారు.

రేపు గురుకుల ప్రవేశ పరీక్ష

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లాలోని 16 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో (అంబేడ్కర్‌ గురుకులాలు) 6–10వ తరగతుల ప్రవేశాలకు ఈ నెల 8న పరీక్ష నిర్వహించనున్నట్లు గురుకులాల ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి కె.విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు పేర్కొన్నారు. 6, 7 తరగతుల ప్రవేశాలకు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు, 8, 9, 10 తరగతుల ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. కేటాయించిన పరీక్ష కేంద్రాల్లోనే పరీక్ష రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హాల్‌టికెట్లు https://apbragcet.apcfss.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఏవైనా సందేహాలుంటే 99493 54106, 94409 49528, 90102 23222 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

మహిళల గొప్పతనం చాటుదాం

మహిళా దినోత్సవం నిర్వహణపై

కలెక్టర్‌ దిశానిర్దేశం

ప్రశాంతి నిలయం: మహిళల గొప్పతనం చాటేలా ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి నియోజక వర్గ, మండల ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... మహిళా దినోత్సవం రోజున మహిళా వ్యాపార వేత్తల విజయ గాథలను ప్రజలకు పరిచయం చేయాలన్నారు. కార్యక్రమంలో మూడువేల మంది మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొనేలా చూడాలన్నారు. ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఐసీడీఎస్‌, పోలీస్‌ శాఖ, పరిశ్రమల శాఖ సంబంధిత లైన్‌ డిపార్ట్‌మెంట్ల సేవలను ప్రదర్శించాలన్నారు. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు, ఉన్నతి, సీఐఎఫ్‌ వంటి పథకాల కింద మెగా చెక్‌ పంపిణీ ఏర్పాటు చేయాలన్నారు.

వెంకన్న ఆశీస్సులు

వైఎస్సార్‌సీపీకే

సిట్‌ నివేదికతో నిజం నిగ్గుతేలింది

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు

ఉష శ్రీ చరణ్‌

పెనుకొండ రూరల్‌: ‘‘వేంకటేశ్వర స్వామి ఆశ్సీసులు ధర్మం వైపు నిలిచే వైఎస్సార్‌ సీపీకే ఉంటాయి. అందుకే ‘కల్తీ’ అంటూ చంద్రబాబు...పవన్‌కల్యాణ్‌ గగ్గోలు పెట్టినా సిట్‌ నివేదిక నిజాలను నిగ్గు తేల్చింది. కాబట్టే చట్టసభల్లో ‘కల్తీ’ వ్యవహారంపై జరుగుతున్న చర్చలో అధికార పార్టీ దాడిని వైఎస్సార్‌సీపీ సభ్యులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు’’ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ కక్షలో భాగంగానే లేని కల్తీ లడ్డు వివాదాన్ని కూటమి పార్టీలు, వైఎస్సార్‌ సీపీకి ఆపాదించాయన్నారు. నెయ్యిలో కల్తీ జరగలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిట్‌) తేల్చి నప్పటికీ, అధికార పార్టీల నాయకులు వైఎస్సార్‌ సీపీపై బురద జల్లడం మానలేదన్నారు. కానీ ఆ స్వామి ఆశీస్సులతో శాసనసభలో 11 మంది సభ్యులు ఉన్నప్పటికీ అధికార పార్టీల అబద్ధాల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారన్నారు.

డైవర్ట్‌ పాలిటిక్స్‌లో భాగమే..

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్న డిమాండ్‌ ప్రజల నుంచి పెరుగుతున్న నేపథ్యంలో కూటమి పార్టీలు డైవర్షన్‌ పాలటిక్స్‌కు తెరలేపాయన్నారు. ‘తిరులమ లడ్డూ’ వివాదాన్ని తీసుకువచ్చి రెండేళ్ల పాటు కాలం వెల్లదీశాయన్నారు. అందుకే చంద్రబాబు సర్కార్‌ కొలువుదీరి రెండేళ్లవుతున్నా...ఏ పథకమూ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. రూ. లక్షల కోట్ల రుణ భారంతో రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement