ఉల్లాసంగా ఉత్సర్గ–26 | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా ఉత్సర్గ–26

Mar 7 2026 9:31 AM | Updated on Mar 7 2026 9:31 AM

అట్టహాసంగా వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం

ప్రతిజ్ఞ చేస్తున్న వైద్య విద్యార్థులు, యూనివర్సిటీ వీసీతో అందుకున్న మెడల్‌ చూపుతున్న వైద్య విద్యార్థిని

అనంతపురం: కష్టపడి చదివి అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొందారు. అంతకుమించి శ్రమించి విజయవంతంగా కోర్సు పూర్తి చేసి తల్లిదండ్రుల సమక్షంలో పట్టా, మెడల్స్‌ అందుకుని మురిసిపోయారు. ప్రభుత్వ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ప్రాంగణంలో శుక్రవారం 2020 బ్యాచ్‌ వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం ‘ఉత్సర్గ–26’ పేరిట అట్టహాసంగా నిర్వహించారు. వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులు పట్టాలు, బంగారు పతకాలు అందుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తమ పిల్లలు డాక్టర్లుగా కొత్త జీవితంలోకి అడుగిడుతున్న వేళ తల్లిదండ్రులు వారిని చూసి మురిసిపోయారు. దాదాపు 150 మంది విద్యార్థులు తల్లిదండ్రులు, బంధువుల కరతాళ ధ్వనుల మధ్య ముఖ్య అతిథి ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు. కళాశాలను విడిచి వెళ్తున్న వేళ విద్యార్థులంతా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో తల్లిదండ్రులు, బంధువులతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు.

గ్రామీణుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి

యువ వైద్యులు గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ సూచించారు. రోగులను ప్రేమ, కరుణ, సానుభూతితో చూడాలన్నారు. వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకోవాలని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, జినోమిక్స్‌ సైన్స్‌లను తమ వృత్తిలో మిళితం చేసుకోవాలన్నారు. ఒక డాక్టర్‌ రోగికి చికిత్స అందించే వ్యక్తి మాత్రమే కాకుండా, వారి జీవితంలో ఆశను నింపే వ్యక్తి కావాలని ఆకాంక్షించారు. యువ వైద్యులు సమాజం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ విజయశ్రీ, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ మల్లీశ్వరి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ బెనడిక్ట్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ షారోన్‌ సోనియా, డాక్టర్‌ తెలుగు మధుసూదన్‌, డాక్టర్‌ శంకర్‌, డాక్టర్‌ ఉమామహేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, వైద్యులు పునర్జీవన కుమార్‌, నాగశ్రీధర్‌, ప్రేమ్‌ కుమార్‌, నిస్సార్‌ బేగం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement