● కదిరి కాలేజీ సర్కిల్‌లో హోటల్ నిర్వహిస్తున్న జాగల రవీంద్ర, అతని కుమారుడు శ్రీనిత్ వద్ద నుంచి పట్టణానికి చెందిన ఇద్దరు అధిక వడ్డీ ఆశ జూపి 30 గ్రాముల బంగారు గొలుసు తీసుకున్నారు. తిరిగి అడిగితే ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టామని.. ఇచ్చే వరకు వేచి ఉండాలన్నారు. గట్టిగా నిలదీస్తే ‘మీ ఇష్టం వచ్చింది చేసుకోండి’ అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా..పట్టణ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది.
● రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఓ వ్యక్తి కొత్తచెరువు, పుట్టపర్తి, గోరంట్ల తదితర ప్రాంతాల్లో చాలామంది దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. తర్వాత తిరిగి ఇవ్వకుండా అడ్డం తిరగడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కొత్తచెరువు, పుట్టపర్తి పోలీస్ స్టేషన్‌లలో ఒకే వ్యక్తిపై 10 పైగా చీటింగ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు అతడిని అదుపులోకి తీసుకోలేదు. దీంతో బాధితులను ఆ ‘పచ్చ’ చీటర్ బెదిరిస్తున్నట్లు తెలిసింది.
● జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ అధికారి అనంతపురంలోని తన ఇంటిని ఓ లాయర్‌కు రూ.80 లక్షలకు విక్రయించాడు. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా చేశాడు. దీంతో లాయర్ ఇంట్లో చేరుకు న్నాడు. ఆ తర్వాత అదే ఇంటిని ఓ కాంట్రాక్టర్‌కు రూ.కోటికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేసిచ్చాడు. ఇంటిని స్వాధీనం చేసుకోవాలని వెళ్లిన కాంట్రాక్టర్‌కు లాయర్ అడ్డుతగిలాడు. దీంతో ఇరువురు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. సదరు అధికారి మాత్రం దర్జాగా ఉద్యోగం చేసుకుంటున్నాడు.
సాక్షి, పుట్టపర్తి ఊరారా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ బంగారంలో బురిడీ కొట్టిస్తున్నారు. అధిక వడ్డీ...తక్కువ ధరకే భూమి..అంటూ వల విసురుతూ అమాయకులను టోకరా వేస్తున్నారు.
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆస్తులు కాజేస్తున్నారు. ఫలితంగా రోజుకో చోట చీటింగ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. మోసగాళ్లకు మద్దతుగా పచ్చ నేతలు రంగంలోకి దిగుతుండగా...బాధితుల గోడు వినే వారే కరువయ్యారు.
నకిలీ బంగారంతో బురిడీ..
బంగారాన్ని పోలిన ఆభరణాలను చూపి అమాయకులకు ఆశ పెడుతున్నారు. తమకు డబ్బు అవసరం ఉండటంతో తక్కువ ధరలకే ఇస్తున్నామని నమ్మబలికి మోసం చేసిన ఘటనలు కదిరి, బత్తలపల్లిలో వెలుగు చూశాయి. బంగారం ధర పది గ్రాములకు రూ.లక్షన్నర కావడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి. దీంతో తక్కువ ధరకే ఇస్తామంటే టక్కున నమ్మి మోసపోతున్నారు. ప్రజల ఆశను ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు పట్టణాల నుంచి పల్లెల వరకు తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్నారు.
వ్యాపారం పేరుతోనే అధికంగా..
రియల్ ఎస్టేట్ పేరుతో చాలామంది చీటింగ్ చేస్తున్నారు. భూమి తక్కువ ధరకే వస్తోందంటూ నమ్మబలకడం.. ఆ తర్వాత ఆ భూమిపై ఇద్దరు – ముగ్గురు హక్కు కలిగి ఉండటంతో సమస్య తలెత్తుతోంది. అలాంటి సమయంలో మధ్యవర్తిగా ఉంటున్న వ్యక్తి చేతులెత్తేస్తాడు. గొడవ పోలీస్ స్టేషన్‌లు, కోర్టుల వరకు వెళ్తుంది. అంతేకాకుండా అగ్రిమెంట్ ఒకరి పేరు మీదు.. పత్రాలు ఇంకొకరి పేరు మీద ఉండటంతోనూ సమస్య తలెత్తుతోంది. ఫలితంగా తక్కువ ధరకు వస్తుందన్న ఆశతో భూములు కొన్నవారంతా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏడాదిన్నరగా ఇదే తంతు..
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జిల్లాలో చీటింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఆయా కేసుల్లో ఉన్న వారిలో 90 శాతం మంది అధికార పార్టీ సానుభూతిపరులే కావడం గమనార్హం. అధికారం అండతో బడా నేతలతో ఫోన్ చేయించుకుని అరెస్టు కాకుండా బయట తిరుగుతున్నారు. ఒకవేళ పోలీసులు పట్టుకున్నా... పచ్చ కండువా చూపి గంటల వ్యవధిలోనే బయటికి వస్తున్నారు. కోర్టుమెట్లెక్కినా.. రోజుల వ్యవధిలోనే బెయిల్‌పై సమాజంలోకి ఎంట్రీ ఇస్తూ మళ్లీ మరో అమాయకుడికి టోకరా వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఊరూరా రెచ్చిపోతున్న కేటుగాళ్లు
మాయమాటలతో అమాయకులకు
శఠగోపం
నకిలీ బంగారంతో బురిడీ..
వ్యాపారం పేరుతో దోపిడీ
భూ లావాదేవీలతో టోకరా
వెలుగులోకి రోజుకో చీటింగ్ కేసు
లబోదిబోమంటున్న బాధితులు


