పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించం
● అంగన్‌వాడీలను హెచ్చరించిన
కలెక్టర్ శ్యాం ప్రసాద్
పుట్టపర్తి టౌన్: అంగన్‌వాడీకి వచ్చే చిన్నారుల సంరక్షణలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్యాంప్రసాద్ హెచ్చరించారు. బుధవారం ఆయన పుట్టపర్తి పరిధిలోని బ్రాహ్మణపల్లి అంగన్‌వాడీ –2 కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ప్రీ స్కూల్ పిల్లల హాజరు, బరువు, ఎత్తును పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, గుడ్డు రంగు పరిమాణాన్ని పరిశీలించారు. ఆహార నాణ్యతను పిల్లలను అడిగి తెలుసుకున్నారు. వయసుకు తగ్గ ఎత్తు పెరగని పిల్లల ఎదుగుదలకు కార్యచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పిల్లల కోసం ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందించాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అంగన్‌వాడీకి సూచించారు. పిల్లల హాజరు శాతం పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదుపు తప్పిన కారు...
ఎస్‌ఐకి గాయాలు
చిలమత్తూరు: మండల పరిధిలోని 544–ఈ జాతీయ రహదారి తుమ్మలకుంట సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ఎస్‌ఐ ఇషాక్ గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హిందూపురం వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న ఇషాక్ కోర్టు పని మీద బుధవారం ఉదయం కదిరికి వెళ్లాడు. కోర్టు పని ముగిశాక తిరిగి వస్తుండగా... తుమ్మలకుంట సమీపంలోకి రాగానే ఆయన ప్రయాణిస్తున్న అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. వఈ ప్రమాదంలో గాయపడిన ఎస్‌ఐ ఇషాక్‌ను స్థానికులు మరో వాహనంలో హిందూపురం ఆస్పత్రికి తరలించారు. కాగా ఘటనపై ఎస్‌ఐ మునీర్ అహ్మద్ ఆరా తీశారు.
నాలుగు ఇసుక ట్రాక్టర్ల సీజ్
పరిగి: మండలంలోని శ్రీరంగరాజుపల్లి వద్ద జయమంగళి నది నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకుని కేసులు నమోదు చేశామని ఎస్‌ఐ రంగడుయాదవ్ తెలిపారు. మడకశిర మండలంలోని కేతేపల్లి మీదుగా కర్ణాటక ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారంతో బుధవారం సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామన్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న నల్లాయనపల్లికి చెందిన నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి వాటి యజమానులపై కేసు నమోదు చేశామన్నారు.
పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించం


