బత్తలపల్లిలో ‘ఏసీబీ’ అలజడి
బత్తలపల్లి: మండల కేంద్రమైన బత్తలపల్లిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తిష్ట వేశారనే సమాచారం స్థానికంగా అలజడి రేపింది. ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగుల గుండెల్లో దడ పుట్టించింది. బుధవారం ఏసీబీ అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు బత్తలపల్లికి వచ్చారనే సమాచారంతో కార్యాలయంలోని ఉద్యోగులు భయాందోళన చెందారు. ఏసీబీ అధికారుల భయంతో ఉద్యోగులంతా మధ్యాహ్నానికే వెళ్లిపోయారు. దీంతో కార్యాలయం బోసిపోగా... వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చి వారంతా అధికారుల తీరును తప్పుపట్టారు.
15 రోజులుగా ప్రచారం..
తహసీల్దార్ కార్యాలయంలోని కొందరు ఉద్యోగులపై ఇటీవల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఏ సమయంలోనైనా దాడులు చేయవచ్చనే వార్తలు 15 రోజులుగా గుప్పుమంటున్నాయి. అందులో భాగంగానే ఏసీబీ అధికారులు రెవెన్యూ కార్యాలయంపై నిఘా వేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. బుధవారం కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తహసీల్దార్ కార్యాలయ పరిసరాల్లోనే ఏసీబీ అధికారులు తిష్ట వేశారనే ప్రచారం సాగింది. అయితే దాడుల సమాచారం బయటకు పొక్కడం... రెవెన్యూ అధికారులు కార్యాలయం నుంచి వెళ్లిపోవడంతో ఏసీబీ అధికారులు కూడా వెనక్కు వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. అంతేకాకుండా మఠం భూముల్లో అవకతవకల సమగ్ర సమాచారం కోసం విజిలెన్స్ అధికారులు కూడా బుధవారం బత్తలపల్లికి వచ్చి రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు పరిశీలించినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు కార్యాలయానికి రావడంతో ఏసీబీ అధికారులేనని భావించి పలువురు అధికారులు కార్యాలయం నుంచి అప్పటికప్పుడు జారుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
దాడుల ప్రచారంతో జారుకున్న
రెవెన్యూ అధికారులు
బోసిపోయిన తహసీల్దార్ కార్యాలయం


