సైబర్ వల.. విలవిల
● హిందూపురానికి చెందిన ఓ యువకుడు బెంగళూరులో బేల్దారిగా పనిచేసే వాడు. స్నేహితులను చూసి ఆన్‌లైన్‌లో బెట్టింగ్ అలవాటు చేసుకున్నాడు. ఇప్పటికే రూ.లక్షలు పోగొట్టుకున్నాడు. ఇటీవల అతను బెట్టింగ్ గెలిచాడు. అతని అకౌంట్‌కు రూ.50 వేలు నగదు బదిలీ అయ్యింది. కానీ విత్‌డ్రా చేసేందుకు వెళ్తే డబ్బు రావడం లేదు. బ్యాంకుకు వెళ్తే అది ఫ్రాండ్ మనీ అని, అందుకే ఫ్రీజ్ చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.
● గతేడాది చిలమత్తూరు మండలం టేకులోడు గ్రామానికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. తాము ఇక్కడే కార్మికులుగా పనిచేస్తున్నామని, డబ్బుతో అర్జెంట్‌గా పని పడిందని క్యాష్ ఇస్తే ..అకౌంట్‌లో కాస్త ఎక్కువగానే నగదు జమ చేయిస్తామని రైతులకు తెలిపారు. దీంతో వారు క్యాష్ ఇవ్వగా.. వారి అకౌంట్లలోకి ఇతర రాష్ట్రాల్లోని అకౌంట్ నుంచి డబ్బు జమ అయ్యింది. అయితే ఈ సాయంత్రానికే ఆ ఖాతాలన్నీ ఫ్రీజ్ అయ్యాయి. రైతులు బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా.. అది ఫ్రాడ్ మనీ అని, సైబర్ క్రైమ్ కేసు కావడంతో ఫ్రీజ్ చేశామని తెలిపారు.
● కదిరికి చెందిన ఓ యువకుడికి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. భారీ ప్యాకేజీ లభించడంతో సదరు యువకుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఆ కంపెనీ అధికారుల కోరిక మేరకు ఆరునెలల బ్యాంకు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. పరిశీలించిన అధికారులు ఉద్యోగం ఇవ్వలేమని చెప్పారు. కారణం ఆరా తీస్తే గుర్తుతెలియని ఖాతాల నుంచి ఖాతాలో నగదు జమైందని, ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ వ్యక్తులను ఉద్యోగంలోకి తీసుకోబోమన్నారు. అది తన స్నేహితుడి కోసం ఇతరులు పంపిన మొత్తమని చెప్పినా... వారు వినిపించుకోలేదు.
...ఇలా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను లూటీ చేస్తున్నారు. నేరుగా డబ్బు తీసుకుని ఇతర అకౌంట్ల నుంచి డబ్బులు వేయిస్తూ సైబర్ క్రైంలో ఇరికిస్తున్నారు. అప్పటికే డబ్బు పోగొట్టుకున్న వారు తాజాగా సైబర్ క్రైం కేసులతో సతమతమవుతున్నారు.
చిలమత్తూరు: సమాజంలో రోజురోజుకూ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. కేటుగాళ్లు కొత్తరకం మోసాలతో నిరక్షరాస్యులనే కాదు విద్యావంతులను సైతం బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతూ సొమ్ము కాజేస్తున్నారు. ‘సైబర్’ దెబ్బకు బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మంతా ఖాళీ అవుతుండగా, ఫ్రాడ్ సొమ్ము వారికి తెలియకుండానే బ్యాంక్ ఖాతాలకు మళ్లడంతో సైబర్ కేసులు మీద పడుతున్నాయి. అంతేకాకుండా బ్యాంక్ ఖాతాలన్నీ ఫ్రీజ్ అవుతున్నాయి. యూపీఐ పేమెంట్లు వచ్చిన తర్వాత సైబర్ నేరాలు భారీగా పెరిగిపోయాయి. ఒకటి బయటపడేలోపే మరో తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.
బెట్టింగ్ సైట్‌ల సొమ్మంతా ఫ్రాడ్..
దేశంలో ఆన్‌లైన్ ఫాంటసీ, గేమింగ్, బెట్టింగ్ యాప్‌లు, సైట్లపై కేంద్రం నిషేధించింది. కానీ ఇంకా చాలా బెట్టింగ్ యాప్‌లు చలామణిలోనే ఉన్నాయి. దీంతో బెట్టింగ్‌లకు అలవాటు పడిన వాళ్లు వాటి ద్వారా బెట్టింగ్ వేస్తూ డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఒక్కోసారి బెట్టింగ్‌లో గెలిచినా వారి ఖాతాలకు ఫ్రాడ్ నగదు వచ్చి చేరుతోంది. సైబర్ క్రైం రిపోర్ట్ అయిన తర్వాతే అసలు విషయం తెలుస్తోంది. నేరుగా అకౌంట్ నుంచి నగదు తీసుకునే వెబ్‌సైట్లు... తాము ఇవ్వాల్సి వచ్చినప్పుడు...ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న ఇతరుల ఖాతాల నుంచి నగదు పంపుతున్నారు. ఇది మరొకచోట సైబర్ మోసాలకు పాల్పడి నొక్కేసిన నగదు ఉంటుండటంతో బెట్టింగ్‌రాయుళ్ల ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయి. దేశంలో నిషేధంలో ఉన్న ఫాంటసీ గేమింగ్‌ను వెబ్‌సైట్‌ల ద్వారా, టెలిగ్రాంల ద్వారా కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో మోసపోతున్న వారి జాబితా అంతకంతకూ పెరుగుతోంది.
అమాయకులను టార్గెట్ చేసి..
జిల్లాలోని మారుమూల గ్రామాల్లోకి వస్తున్న సైబర్ నేరగాళ్లు..తమకు చాలా అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని, డబ్బులిస్తే అకౌంట్‌లో నగదు జమ చేయిస్తామని, ఇందుకు అదనంగా డబ్బు కూడా చెల్లిస్తామని ఆశలు కల్పిస్తున్నారు. నమ్మి డబ్బులిస్తే వెంటనే ఇతర రాష్ట్రాల అకౌంట్ల నుంచి నగదు జమ చేయిస్తారు. అయితే ఆ డబ్బు ఫ్రాడ్ మనీగా తేలి అకౌంట్ ఫ్రీజ్ అవుతుండగా బాధితులు లబోదిబోమంటున్నారు. పైగా సైబర్ క్రైం కేసులో ఇరుక్కుని రోజుల తరబడి పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.
ఫ్రాడ్ మనీ అంటే
సైబర్ నేరగాళ్లు అమాయకులకు డబ్బు ఆశ చూపి వారి బ్యాంకు అకౌంట్లను తీసుకుంటారు. ఆ అకౌంట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు నడుపుతారు. మిగతా వారికీ టోకరా వేసి డబ్బును సదరు అకౌంట్లకు జమ చేయించుకుంటారు. అరకొర డబ్బు పంపేందుకు ఆ బ్యాంకు ఖాతాలను వాడుకుంటారు. దీన్నే ఫ్రాడ్ మనీ అంటారు. అయితే అప్పటికే ఆ అకౌంట్‌లపై ఫిర్యాదులు అంది ఉండటం వల్ల సైబర్ క్రైం విభాగం ఫిర్యాదు మేరకు బ్యాంకు అధికారులు ఆ అకౌంట్ నుంచి ఏయే ఖాతాలకు నగదు బదిలీ అయ్యిందో ఆ ఖాతాలన్నీ బ్లాక్ చేస్తారు. ఎంత నగదు బదిలీ చేశారో అంత మొత్తం ‘మైనస్’ చేస్తారు. దీంతో నగదు జమ కాకపోగా.. ఎదురు చెల్లించాల్సి వస్తుంది.
సైబర్ వల.. విలవిల


