బెల్ట్‌షాపు మూయమన్నందుకు కేసు
చిలమత్తూరు: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న టీడీపీ నేతలు... ప్రతిపక్ష పార్టీల నేతలపై పోలీసులను ఉసిగొలిపి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు. తామేం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే 544–ఈ జాతీయ రహదారి కొడికొండ చెక్‌పోస్ట్‌లో అక్రమంగా ఏర్పాటు చేసిన బెల్ట్ దుకాణం వద్ద ఈ నెల 6న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. నిరుపేదల జీవితాలను నాశనం చేస్తున్న బెల్టు దుకాణాన్ని సీజ్ చేయాలని నిరసన తెలిపారు. ఎంతసేపటికీ ఎకై ్సజ్‌శాఖ అధికారులు రాకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బలవంతంగా ఖాళీ చేయించి వైఎస్సార్ సీపీ నేత వేణురెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. బెల్ట్ షాపును సీఐ జనార్దన్ మూసివేయించారు. అనంతరం వేణురెడ్డితో పాటు 23 మందిపై 132, 126(2), రెడ్ విత్ 3(5) బీఎన్‌ఎస్ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అసలు ధర్నాలో పాల్గొనని వారినీ కేసులో ఇరికించారు. బెల్టు దుకాణాన్ని మూయాలని న్యాయంగా పోరాడిన వారిపై ఇలా రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదు చేయడంపై ప్రజలు, వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడుతున్నారు.
అక్రమ కేసులతో ఉద్యమాలను అణచలేరు..
అక్రమ కేసులు బనాయించి ప్రజా ఉద్యమాలను అణచలేరని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. బెల్ట్ దుకాణాన్ని తొలగించాలని శాంతియుత నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, తాము కూడా శాంతియుతంగానే నిరసన తెలిపామన్నారు. అయినా కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, అధికార టీడీపీ ఆడిచ్చినట్టు ఆడుతున్నారన్నారు. చేతనైతే అక్రమాలు చేస్తున్న టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలన్నారు. కేసులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడవద్దని... ఎవరెన్ని చేసినా ప్రజల కోసం పోరాటమే లక్ష్యంగా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. కేసుల సంగతి పార్టీ చూసుకుంటుందని భరోసా ఇచ్చారు.
వైఎస్సార్ సీపీ నేత వేణురెడ్డితోపాటు 23 మందిపై కేసు నమోదు
ధర్నాలో పాల్గొనని వారినీ
కేసులో ఇరికించిన వైనం


