ఇష్టారాజ్యంగా పనిచేస్తే ఇంటికి పంపుతా
● బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్‌పై
కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆగ్రహం
పుట్టపర్తి అర్బన్: ‘‘మీ పనితీరుపై ప్రజల నుంచి ఫిర్యాదులు చాలా అందుతున్నాయి.. సేవ చేయాల్సిన మీరు ఇష్టారాజ్యంగా పనిచేస్తే చర్యలు తప్పవు. మరోసారి ఫిర్యాదులు అందితే ఇంటికి పంపుతా జాగ్రత్త’’ అంటూ బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ మురళీకృష్ణపై కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టర్ బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించారు. రిజిస్ట్రేషన్ పని మీద అక్కడికి వచ్చిన వారితో మాట్లాడి సమస్యలు ఆరా తీశారు. ఈ సందర్భంలోనే సబ్ రిజిస్ట్రార్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. అనంతరం ఆయన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందితో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రతి పని పారదర్శకంగా ఉండాలన్నారు. అనవసరంగా ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం మానుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేయాలన్నారు. కార్యాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, రికార్డులు భద్రంగా ఉంచాలని ఆదేశించారు.
పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
ముదిగుబ్బ: రీసర్వే పూర్తయిన మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలోని రైతులకు గురువారం కలెక్టర్ శ్యాం ప్రసాద్ నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ రికార్డుల పారదర్శకతతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. పాసు పుస్తకాలతో రైతులకు ప్రభుత్వ పథకాలు సులభంగా అందుతాయన్నారు. అలాగే రీసర్వే పూర్తయి కచ్చితమైన హద్దులు చూపడం వల్ల భూతగాదాలకు ఆస్కారం ఉండదన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ నారాయణస్వామి, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
బ్రాహ్మణపల్లిలో పాసుపుస్తకాలు
పంపిణీ చేసిన జేసీ
సోమందేపల్లి: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గురువారం పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్నామన్నారు. అనంతరం జేసీ జూలకుంట గ్రామంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అంతకుముందు సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందించాలని సిబ్బందిని ఆదేశించారు. జేసీ వెంట ఆర్డీఓ ఆనంద్ కుమార్, ఏపీ మార్క్‌ఫెడ్ మేనేజర్ గీత, తహసీల్దార్ మారుతి, రైతులు తదితరులు ఉన్నారు.
వీఆర్‌కు తనకల్లు ఎస్‌ఐ గోపి
తనకల్లు: సబ్‌ఇన్‌స్పెక్టర్ గోపిని వీఆర్‌కు పంపుతూ పోలీసు ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. ఈ నెల 5వ తేదీ తెల్లవారుజూమున స్థానిక పోలీస్‌స్టేషన్ గేటు ముందు ఈశ్వరప్ప అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పోలీసులు ఎదుటే జరిగింది. ఇందుకు బాధ్యున్ని చేస్తూ ఎస్‌ఐ గోపీని వీఆర్‌కు పంపినట్లు తెలుస్తోంది.
ఇష్టారాజ్యంగా పనిచేస్తే ఇంటికి పంపుతా


