కోర్టుకు బాంబు బెదిరింపు
అనంతపురం: బాంబు బెదిరింపుల నేపథ్యంలో అనంతపురం జిల్లా కోర్టులో గురువారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా సుమారు 50 జిల్లా కోర్టులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపుల ఈ–మెయిల్స్ అందాయి. ‘మహమ్మద్ అస్లాం విక్రమ్ తమిళ లిబరేషన్ ఆర్గనైజేషన్ (టీఎల్‌ఓ)’ పేరిట ఈ–మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. అనంతపురం జిల్లా కోర్టు, రికార్డుల రూంలో తనిఖీలు నిర్వహించారు. అవి ఉత్తుత్తి బెదిరింపులని తేలిందని అనంతపురం టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. కోర్టు ఆవరణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, బాంబు బెదిరింపుల నేపథ్యంలో గురువారం జిల్లా కోర్టులో కార్యకలాపాలన్నీ బంద్ చేశారు. కేసుల విచారణకు ఆటంకం ఏర్పడింది.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీల్లో ఇద్దరికి చోటు
చిలమత్తూరు: వైఎస్సార్ సీపీ అనుబంధ కమిటీల్లో ఇద్దరు జిల్లావాసులకు చోటు దక్కింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు హిందూపురానికి చెందిన వాల్మీకి లోకేష్‌ను యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అలాగే పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన టి. చంద్రశేఖర్‌రెడ్డిని లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. తనపై నమ్మకం ఉంచి పదవి అప్పగించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వాల్మీకి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన ఎంపికకు సహకరించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపికకు కృతజ్ఞతలు తెలిపారు.
కోర్టుకు బాంబు బెదిరింపు


