కలెక్టరేట్‌లో న్యూ ఇయర్ వేడుకలు
● పుస్తకాలు, మెడికల్ కిట్లు అందజేసి కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఆయా శాఖల ఉద్యోగులు కలెక్టర్ శ్యాం ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ పిలుపు మేరకు పుస్తకాలు, పెన్నులు, పోటీ పరీక్షలకు ఉపయోగపడే బుక్‌లెట్లు, టీబీ రోగులకు ఉపయోగపడే మందులు, దుప్పట్లను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నూతన సంవత్సరాన్ని సేవతో ప్రారంభించడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రతి ఉద్యోగి సామాజిక సేవకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రామసుబ్బయ్య, ఏఓ వెంకటనారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
కోడి పందెం స్థావరంపై దాడి
● మూడు కోడి పుంజులు స్వాధీనం..
ఇద్దరి అరెస్ట్
రొళ్ల: మండల పరిధిలోని జీఎన్ పాళ్యం గ్రామ పొలిమేరలో గురువారం సాయంత్రం కోడి పందెం స్థావరంపై పోలీసులు దాడి చేశారు. మూడు కోడి పుంజులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇరువురిపై కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ గౌతమి తెలిపిన వివరాల మేరకు... జీఎన్ పాళ్యం గ్రామ పొలిమేరలో కోడి పందేలు ఆడుతున్నట్లు గురువారం సాయంత్రం గ్రామస్తుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ గౌతమి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన పందెం రాయుళ్లు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో మూడు కోడి పుంజులతో పాటు స్థావరం నిర్వహిస్తున్న ఇద్దరిని అదుపులోనికి తీసుకున్నారు. నాలుగు బైక్‌లు సైతం స్వాధీనం చేసుకున్నారు. బైక్‌ల నంబర్ల ఆధారంగా పందెం రాయుళ్లను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు. జూదం, మట్కా ఆడినా... బెల్టుషాపులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ గౌతమి హెచ్చరించారు.
తలుపులలో 9 మంది అరెస్ట్
తలుపుల : మండలంలోని ఎగువ నిగ్గిడి సమీపంలోని కోడి పందెం స్థావరంపై ఎస్‌ఐ చెన్నయ్య గురువారం దాడి చేశారు. 9 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. అలాగే ఐదు పందెం కోళ్లతో పాటు రూ.2,290 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెన్నయ్య తెలిపారు. ఈ దాడిలో ఏఎస్‌ఐ గుర్రప్ప, పోలీసులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో న్యూ ఇయర్ వేడుకలు


