దీపికను ఆదర్శంగా తీసుకుని ఎదగాలి
● విద్యార్థులకు రఘువీరారెడ్డి సూచన
మడకశిర రూరల్: విద్యార్థులంతా దీపికను ఆదర్శంగా తీసుకుని ఎదగాలని నీలకంఠేశ్వర సముదాయ దేవస్థానం కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి సూచించారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని గురువారం నీలకంఠాపురం గ్రామంలోని ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో భారత అంధుల మహిళల టీ–20 క్రికెట్ టీమ్ కెప్టెన్ దీపికకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. తొలుత దీపిక, ఆలయ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి క్రికెట్ ఆడి క్రీడాకారులను సంతోష పరిచారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ... తంబాలహట్టి గ్రామానికి చెందిన దీపిక సారథ్యంలో భారత అంధమహిళల క్రికెట్ జట్టు టీ–20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. దీపిక విజయానికి కంటి చూపు అడుకాలేదన్నారు. పట్టుదలతో శ్రమించి విజయం సాధించిన దీపిక దేశ గౌరవాన్ని పెంచిందన్నారు. ఆనంతరం దీపికతోపాటు ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించి రూ.లక్ష నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. అలాగే దీపికకు సహకారం అందించి ప్రోత్సహించిన సమతా ఫౌండేషన్‌కు రూ.లక్ష నగదును రఘువీరారెడ్డి అందజేశారు.
గురువులకు పాద పూజ..
నీలకంఠాపురం ఉన్నత పాఠశాలలో గతంలో పదో తరగతి చదువుకున్న వారంతా గురువారం పాఠశాలలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు రఘువీరారెడ్డితో పాటు పూర్వపు విద్యార్థులు పాదాలు కడిగి పాద పూజ చేసి సన్మానించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


