పచ్చ మోసం... నేలపాఠం
చిలమత్తూరు: సైబీరియన్ పక్షులకు విడిది కేంద్రం వెంకటాపురం జెడ్పీ హైస్కూల్ స్థలంపై పచ్చ నేతలు కన్నేశారు. ఎలాగైనా ఆ స్థలం కొట్టేసేందుకు కోర్టుకెక్కారు. దీంతో భవన నిర్మాణం ఆగిపోగా...విద్యార్థులు కూర్చుని పాఠాలు వింటున్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంజూరు..
వెంకటాపురానికి వైఎస్సార్ సీపీ హయాంలో జెడ్పీ హైస్కూల్ మంజూరైంది. పాఠశాల నిర్మాణానికి స్థలం లేకపోవడంతో ఎంపీపీగా ఉన్న పురుషోత్తమరెడ్డి లక్ష్మీపురం సమీపంలో రోడ్డు పక్కనే ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి తన సొంత డబ్బుతో నాలుగు తాత్కాలిక గదులను నిర్మించి ఇచ్చారు. 2020లో ‘నాడు–నేడు’ కింద పాఠశాల ఎంపిక కాగా, మరుగుదొడ్లు, డెస్క్‌లు మంజూరయ్యాయి. అయితే పాఠశాలకు భవనం లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు.
పాఠశాల స్థలంపై పచ్చ నేతల కన్ను..
భవన నిర్మాణం ప్రారంభించేలోపు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వెంకటాపురం జెడ్పీ హైస్కూల్‌కు గ్రహణం పట్టింది. పాఠశాల భవన నిర్మాణానికి సీఎస్‌ఆర్ నిధుల కింద రూ.1.50 కోట్లు మంజూరు కాగా, నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే రోడ్డు పక్కనే పాఠశాల ఉండటం, పాఠశాల భవనానికి కేటాయించిన స్థలంపై కొందరి టీడీపీ నేతల కన్ను పడినట్లుగా తెలుస్తోంది. విలువైన ఆ స్థలాన్ని దక్కించుకునేందుకు కుట్ర చేశారు. అధికారం అడ్డుపెట్టుకుని పంచాయతీ కార్యదర్శి ద్వారా అకమ్రంగా పొజిషన్ సర్టిఫికెట్ పొంది పాఠశాల కొనసాగుతున్న స్థలంలో తాము సాగులో ఉన్నామని కోర్టుకు వెళ్లారు. దీంతో పాఠశాల భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం 130 మంది విద్యార్థులు ఆరుబయట నేలపై దుమ్ముధూళిలో పాఠాలు నేర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అన్నీ తెలిసినా ఎమ్మెల్యే బాలకృష్ణ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వైఎస్సార్ సీపీ హయాంలో
వెంకటాపురం జెడ్పీ హైస్కూల్ మంజూరు
భవన నిర్మాణం ప్రారంభించేలోపు కోర్టుకెక్కిన పచ్చ నేతలు
ఆరుబయట కటిక నేలపై
చదువుకుంటున్న విద్యార్థులు
పచ్చ మోసం... నేలపాఠం


