ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
ప్రశాంతి నిలయం: శ్రీసత్యసాయిని ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న రహదారి భద్రత మాసోత్సవాల కరపత్రాలు, అవగాహన బ్యానర్లను గురువారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. హెల్మెట్ వాడకం ఉపయోగాలను యువతకు వివరించాలన్నారు. ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యతనిస్తూ... నిత్యం ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు తెలియజెప్పాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కరుణసాగర్‌రెడ్డి, రవాణా అఽధికారులు శ్రీనివాసులు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యం..
జిల్లాలో క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేయాలని క్షయవ్యాధి నిర్మూలన విభాగం అధికారులను కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఆదేశించారు. ‘నిక్షయ్ మిత్ర’ కార్యక్రమం అమలులో భాగంగా కలెక్టర్ పెనుకొండ టీబీ యూనిట్‌కు చెందిన 10 మంది క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకున్నారు. గురువారం కలెక్టరేట్‌లో తన చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో తాను దత్తత తీసుకున్న రోగులకు అవసరమైన పోషకాహార కిట్లను అందజేశారు. పుట్టపర్తి టీబీ యూనిట్ పరిధిలోని 10 మందిని డీఎంహెచ్‌ఓ దత్తత తీసుకుని కిట్లను అందజేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవల కోఆర్డినేటర్ మరో ఇద్దరు రోగులను దత్తత తీసుకున్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ‘నిక్షయ్ మిత్ర’లుగా మారి క్షయవ్యాధి గ్రస్తులకు అండగా నిలవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
అధికారులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపు


