పరిటాల అనుచరుడి దుర్మార్గం
సాక్షి, పుట్టపర్తి: మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో అధికారం అడ్డు పెట్టుకుని.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరులు భూ దందాకు తెరలేపారు. ఏళ్లుగా సాగులో ఉన్న రైతులను బెదిరించి.. పొలాల్లో పాగా వేసేందుకు యత్నిస్తున్నారు. పది రోజులుగా ఈ భూ వివాదం కొనసాగుతూ వస్తోంది. తాజాగా మంగళవారం పొలం చుట్టూ వేసిన కంచెను ధ్వంసం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధిత రైతులు ధర్మవరం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న అనుమానితుల్లో అనంతపురం రూరల్ మండలానికి చెందిన టీడీపీ కార్యకర్త సాయినాథ్‌రెడ్డి ఉన్నాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రి ధ్వంసం కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న అతన్ని రెండు రోజుల క్రితమే అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు.
ప్రీకాస్ట్ వాల్ ధ్వంసం
ధర్మవరం మండలం కుణుతూరు రెవెన్యూ పరిధిలోని పోతుకుంటలో సర్వే నంబరు 353లో ధర్మవరానికి చెందిన ఆదినారాయణరెడ్డితో పాటు రామచంద్రారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రాఘవ, వీరనారప్ప, కుళ్లాయప్ప పేరున మొత్తం 11.25 ఎకరాల పొలం ఉంది. ఈ నెల 11వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు ఆ పొలం చుట్టూ ఉన్న ప్రీకాస్ట్ వాల్‌ను రాత్రికి రాత్రే ధ్వంసం చేశారు. దీనిపై ధర్మవరం రూరల్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అనంతపురం మండలం చియ్యేడు గ్రామానికి చెందిన సాయినాథ్‌రెడ్డి, రామలింగారెడ్డితో పాటు వారి అనుచరుడు జయరామ్‌పై అనుమానం ఉన్నట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుల అదుపులోనే అనుమానితుడు
రెండు రోజుల క్రితం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిపై కొందరు దాడి చేశారు. రెంటల్ పార్టనర్‌గా ఉన్న వారి మధ్య తగాదా గొడవకు దారి తీసింది. అయితే దాడి చేసిన ఏడుగురిని అనంతపురం టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసులో ధర్మవరం పరిధిలో భూ దందాలో కేసులో అనుమానితుడిగా ఉన్న సాయినాథ్‌రెడ్డి కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆ కేసులో ఉన్న సాయినాథ్‌రెడ్డిని.. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే.. ధర్మవరం మండలం పోతుకుంట పొలంలో కంచె ధ్వంసం కేసు కూడా వెలుగు చూసే అవకాశం ఉందని బాధితులు వివరించారు.
ధర్మవరం వద్ద రైతు పొలంలో కంచె ధ్వంసం
ఎమ్మెల్యే సునీత అండతో రెచ్చిపోయిన వైనం
ధర్మవరం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
టీడీపీకి చెందిన సాయినాథ్‌రెడ్డితో పాటు ఇంకొందరిపై అనుమానం
ఇప్పటికే మరో కేసులో పోలీసుల అదుపులో ఉన్న సాయినాథ్‌రెడ్డి
పరిటాల అనుచరుడి దుర్మార్గం


