జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
మడకశిర రూరల్: యూపీ రాజధాని లక్నోలో త్వరలో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మడకశిరలోని కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న జీవీపాళ్యం గ్రామానికి చెందిన ఆర్.దీక్ష ఎంపికై ంది. ఈ మేరకు ఆ పాఠశాల పీఈటీ అనిత మంగళవారం వెల్లడించారు. వినుకొండలో జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి 800 మీటర్ల పరుగు పోటీల్లో కాంస్య పతాకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు వివరించారు. ప్రతిభ చాటిన విద్యార్థిని కేజీబీవీ బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.
ప్రమాదంలో యువకులకు తీవ్రగాయాలు
తనకల్లు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిన ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు... కదిరి పట్టణానికి చెందిన తేజ, లోకేష్, మోహన్‌కృష్ణ కర్ణాటకలోని చింతామణికి ఒకే ద్విచక్ర వాహనంపై మంగళవారం బయలుదేరారు. తనకల్లు మండలం మండ్లిపల్లి సమీపంలోకి చేరుకోగానే 42వ జాతీయ రహదారిపై మలుపు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక అదుపు తప్పి కిందపడ్డారు. ఘటనలో తేజ, లోకేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో మోహన్‌కృష్ణ బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న వందేమాతరం టీం సభ్యులు తమ ఉచిత అంబులెన్స్‌లో క్షతగాత్రులను చికిత్స కోసం తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కదిరిలోని ఏరియా ఆస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు.
ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం
కూడేరు: ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించడంతో ఓ యువకుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం రూరల్ పరిధిలోని పిల్లిగుండ్ల కాలనీలో నివాసముంటున్న వంశీకృష్ణ మంగళవారం ఉదయం తన సోదరి లింగమ్మ పిల్లలు లిఖిత, రక్షితను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ఆలూరులో జరిగే బంధువుల ఇంట పెళ్లికి బయలుదేరాడు. కూడేరులోని విద్యుత్ శాఖ కార్యాలయం వద్దకు చేరుకోగానే శరవేగంగా ద్విచక్ర వాహనంపై వస్తున్న చోళసముద్రానికి చెందిన శంకర్ వెనుక నుంచి ఢీకొన్నాడు. ఘటనలో రెండు బైక్‌లపై ఉన్న వారు కిందపడ్డారు. అదే సమయంలో అనంతపురం వెళుతున్న ఉరవకొండ డిపో బస్సు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బ్రేక్ వేశాడు. అప్పటికే ఓ బైక్ బస్సు కిందకు చేరుకుంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. తీవ్రంగా గాయపడిన నలుగురినీ 108 అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
హిందూపురం: స్థానిక బస్టాండ్ సమీపంలో మంగళవారం రాత్రి 45 ఏళ్ల వయసున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.


