రుణాలు ఇస్తామంటూ మహిళలకు కుచ్చుటోపీ
రాయదుర్గం టౌన్: స్థానిక ముత్తరాసి కాలనీ, శనీశ్వరాలయం, గ్యాస్ గోడౌన్ ఏరియాతో పాటు మండలంలోని ఆయతపల్లి గ్రామంలో రుణాలు మంజూరు చేస్తామంటూ ఒక్కో మహిళతో రూ.3 వేలు చొప్పున ఇద్దరు వ్యక్తులు వసూలు చేసుకుని ఉడాయించారు. ‘ఉషోదయ ఫైనాన్స్ కంపెనీ నుంచి వచ్చాం. రూ.55 వేల నుంచి రూ.2 లక్షల వరకూ రుణాలు ఇస్తాం. క్రమం తప్పకుండా కంతులు చెల్లిస్తే చాలు’ అంటూ మోసానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మోసపోయి ఇప్పటి వరకూ బయట పడిన వారిలో ముత్తరాసికాలనీకి చెందిన రాజి, చౌడమ్మ, ముత్యమ్మ, అనంతమ్మ, కృష్ణమ్మ, సరస్వతి, గంగమ్మ, లోకమ్మ తదితరులు మొత్తం 11 మంది ఉన్నారు. తీసుకున్న రుణానికి సంబంధించి నెలవారీ కంతులు చెల్లించే అవకాశం ఉంటుందని నమ్మించి గత శనివారం ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరితో రూ.3 వేలు చొప్పున వసూలు చేసుకుని గిఫ్ట్ కింద ఓ నాసిరకం ఫ్యాన్‌ను అంటగట్టి వెళ్లారని బాధితులు వాపోయారు. ఆ తర్వాత రుణం కోసం వారిచ్చిన ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోందని, దీంతో తాము మోసపోయినట్లుగా గుర్తించామని వివరించారు. మోసగాళ్లపై చర్యలు తీసుకుని తమ డబ్బు వెనక్కు ఇప్పించాలని కోరారు.
ఒక్కొక్కరితో రూ.3 వేలు వసూలు చేసి ఉడాయించిన మోసగాళ్లు


