బుల్లెట్ల తయారీ కంపెనీ దురాక్రమణ
చెన్నేకొత్తపల్లి: తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పట్టాభూములను బుల్లెట్ల (తుపాకుల్లో వినియోగించేవి) తయారీ కంపెనీ యాజమాన్యం ఆక్రమించుకుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం కంపెనీ ప్రధాన గేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు సీపీఐ నేత ముత్యాలమ్మ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బాధిత రైతులు హనుమేనాయక్, నితేష్, ఉమేశ్వరి, ఎర్రమ్మ, అహోబిలప్ప, తదితరులు మాట్లాడుతూ.. బతుకు తెరువు కోసం తాము ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన సమయంలో సీకేపల్లి మండలం న్యామద్దల సమీపంలో బుల్లెట్ల తయారీ కంపెనీ యాజమాన్యం తమ భూములను ఆక్రమించుకుని చుట్టూ ప్రహరీ నిర్మించిందన్నారు. కంపెనీ వ్యవహారాలు చూస్తున్న వ్యక్తి చుట్టూ దాదాపు మూడేళ్లుగా తిరిగినా తమకు ఇప్పటి వరకూ న్యాయం చేకూరలేదని వాపోయారు. పైగా నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాము భూ సర్వే చేయించుకునేందుకు సిద్ధపడి సర్వేయర్‌ను పిలుచుకెళితే లోపలకు అనుమతించకుండా వెనక్కు పంపారని తెలిపారు. తమ భూములు సర్వే చేయించుకునే హక్కు కూడా తమకు లేకుండా చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. తక్కువ ధరకు తమ భూములను తీసుకోవాలని చూస్తే తాము ఒప్పుకోబోమన్నారు. తమకు న్యాయం చేకూరే వరకూ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
పట్టా భూముల్లోకి రైతులు వెళ్లకుండా అడ్డుకుంటున్న వైనం
భూ సర్వేకు సహకరించని యాజమాన్యం
న్యాయం చేయాలంటూ కంపెనీ ప్రధాన గేటు ఎదుట రైతుల నిరసన


