నియోజకవర్గ అభివృద్ధి చూపండి
పుట్టపర్తి టౌన్: మూడు సార్లు మంత్రిగా ఉన్న పల్లె రఘునాథరెడ్డి ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన నిలబడి నిజాలు మాట్లాడితే నోటి దురుసు, నియోజవర్గ అభివృద్ధికి ఏమి చేయలేదని విమర్శించిన పల్లె రఘునాథరెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా ద్వారా కౌంటర్ వీడియో విడుదల చేశారు. సత్యసాయి పేరుతో పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా తీసుకువచ్చింది గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే అనే విషయాన్ని రఘునాథరెడ్డి తెలుసుకోవాలన్నారు. 2017లో ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలోని 193 చెరువులు నింపేందుకు రూ.344 కోట్ల నిధులతో పనులు ప్రారంభించామని గుర్తు చేశారు. ముదిగుబ్బ నుంచి కోడూరు వరకు 342వ జాతీయ రహదారి, గ్రీన్ ఫీల్డ్ హైవే తీసుకొచ్చింది కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని తెలిపారు. నేషనల్ టూరిజం కల్చరల్‌గా పుట్టపర్తిని తీర్చిదిద్దేందుకు జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిని అభివృద్ధి చేసినట్లు గొప్పలకు పోతున్న రఘునాథరెడ్డి.. ఉత్సవాల ఖర్చు పేరుతో తీసుకువచ్చిన రూ.10 కోట్లు నిధులను ఎక్కడ ఖర్చు చేశారో బహిర్గతం చేయాలన్నారు. గత ప్రభుత్వంలో మలకవేమల నుంచి ఓడీచెరువు, అమడుగూరు, నల్లమాడ మండలాలు కలుపుతూ కర్ణాటకలోని బాగేపల్లి వరకూ జాతీయ రహదారి ప్రతిపాదన ఉందన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి పుట్టపర్తి సమీపంలో కప్పలబండ పొలంలో 20 ఎకరాల భూమి కేటాయిస్తూ సిద్ధం చేసిన డీపీఆర్ అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లుగా గుర్తు చేశారు. సత్యసాయి విమానాశ్రయాన్ని ప్రభుత్వంలోకి విలీనం చేసుకుని విస్తరణ చేపట్టి, ఏపీ నావిగేషన్ ద్వారా అభివృద్ధి చేస్తే లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. పల్లె అసమర్థత కారణంగా ఇది సాధ్యం కాక మరో ప్రాంతానికి తరలిపోతోందన్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కృషి విజ్ఙాన కేంద్రం ఏర్పాటు చేయాలని గతంలో చేసిన ప్రతిపాదనను రఘునాథరెడ్డి పట్టించుకోకపోవడంతో ఇది కూడా మరో నియోజకవర్గానికి తరలిపోతోందన్నారు. ఇప్పటికై నా విమర్శలు మాని నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.
మాజీ మంత్రి పల్లైపె దుద్దుకుంట ధ్వజం


