హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించారు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు
కళ్యాణదుర్గం రూరల్: కుటుంబ పరువు కోసం తమ కుమారుడిని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ బాధిత కుటుంబసభ్యులు మంగళశారం కళ్యాణదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన తొలిచేటి గోవిందు కుమార్తె తరుచూ బ్రహ్మసముద్రం మండలం యానకల్లులోని వారి బంధువుల ఇంటికి వచ్చేదని, ఈ క్రమంలో యానకల్లుకు చెందిన బోయ ఆనంద్‌తో అయిన పరిచయం ప్రేమగా మారిందని గుర్తు చేశారు. ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు తమ బంధువుల యువకుడికి ఇచ్చి పెళ్లి జరిపించారన్నారు. ఆ తర్వాత యువతి ప్రేమ విషయం తెలుసుకున్న భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడని, నాలుగు రోజుల క్రితం బెంగళూరులో ఉన్న ఆనంద్‌కు ఆ యువతి ఫోన్ చేసి కళ్యాణదుర్గం వస్తే పెళ్లి చేసుకుందామని తెలిపిందన్నారు. దీంతో ఈ నెల 21న కళ్యాణదుర్గానికి వచ్చిన ఆనంద్ బైపాస్ వద్ద పురుగుల మందు సేవించి.. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని ఆనంద్ తండ్రి వెంకటేశులు, అతని సోదరి వరలక్ష్మి పేర్కొన్నారు. ఈ అంశంలో లోతైన దర్యాప్తు చేపట్టి వాస్తవాలు నిగ్గుతేల్చాలంటూ బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


