ఒత్తిళ్లు తాళలేక లైన్‌మెన్ ఆత్మహత్యాయత్నం
ఉరవకొండ: అధికారిక ఒత్తిళ్లు తాళలేక స్థానిక శివరామిరెడ్డి, డ్రైవర్స్, తదితర కాలనీల విద్యుత్ శాఖ లైన్‌మెన్ ఎన్.రమేష్ మంగళవారం కార్యాలయంలోనే పురుగుల మందు తాగాడు. గమనించిన సహచర ఉద్యోగులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. కాగా, విద్యుత్ బిల్లుల బకాయిలు కట్టించాలంటూ కొన్ని నెలలుగా రమేష్‌పై ఉన్నతాధికారులు ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, అయితే అతనికి కేటాయించిన కాలనీల్లో ఎక్కువ శాతం మంది పేద, బడుగు వర్గాలు వారు ఉండటంతో వారు సమయానికి బిల్లులు చెల్లించకపోయేవారుగా తెలుస్తోంది. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక అఘాయిత్యానికి పాల్పడినట్లుగా సమాచారం. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.


