నక్కకు చికిత్స
ముదిగుబ్బ: మండల కేంద్రం సమీపంలో అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్న నక్కను స్థానికులు మంగళవారం గమనించి పశువైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు... రక్తహీనత కారణంగా తరచూ ఫిట్స్‌కు గురవుతున్నట్లుగా గుర్తించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పులివెందులకు తరలించినట్లు పశువైద్యాధికారి డాక్టర్ రామేశ్వరరావు తెలిపారు.
బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
ధర్మవరం అర్బన్: ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు విజయవాడ వేదికగా జరిగే 69వ ఎస్జీఎఫ్ అండర్–19 రాష్ట్రా స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించి జిల్లా బాలబాలికల జట్లను మంగళవారం ఎంపిక చేశారు. ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో చేపట్టిన ఈ ప్రక్రియకు పలువురు క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఎంపికై న బాలుర విభాగంలో ధర్మవరానికి చెందిన విజయ్‌తరుణ్, సాయికుమార్, బాలికల విభాగంలో యశస్విని, అలేఖ్య ఉన్నారు. వీరిని జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అసోసియేట్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, ధర్మాంబ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ్‌తుల్లా, కోచ్ సంజయ్ అభినందించారు.
కోగటం మెరుపు ఇన్నింగ్స్
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న అండర్ –19 కూచ్‌బిహార్ క్రికెట్ ట్రోఫీలో భాగంగా మూడో రోజు ఆంధ్ర జట్టు ఆటగాడు కోగటం హనీష్ వీరారెడ్డి మెరుపు ఇన్నింగ్స్ తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మంగళవారం తమ రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోర్ 46/2తో కొనసాగించిన ఆంధ్ర జట్టు 94.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. జట్టులో లోకల్ ఆటగాడు కోగటం హనీష్ వీరారెడ్డి 103 బంతుల్లో 7 బౌండరీలు, 4 భారీ సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. అలాగే పరమవీరసింగ్ 35, మన్విత్‌రెడ్డి 26 పరుగులు చేశారు. అనంతరం 374 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఒడిశా జట్టు 54.2 ఓవర్ల వద్ద 120 పరుగులకు కుప్పకూలింది. ఆంధ్ర జట్టు కెప్టెన్ రాజేష్ తన స్పిన్ మాయాజాలంతో 6 వికెట్లు పడగొట్టి ఒడిశా ఓటమికి కారణమయ్యాడు. అలాతే బౌలర్లు ఏఎన్‌వీ లోహిత్ 3, కార్తీక్ రెడ్డి ఒక వికెట్ తీశారు.
గంజాయి ముఠా అరెస్ట్
అనంతపురం సెంట్రల్: విశాఖపట్నం నుంచి గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులను మంగళవారం అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం త్రీటౌన్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ వెల్లడించారు. పట్టుబడిన వారిలో అనంతపురంలోని ఎర్రనేల కొట్టాలకు చెందిన రహమత్, ఆరో రోడ్డులో నివాసముంటున్న అస్లాంబాషా, 3వ రోడ్డుకు చెందిన రవికుమార్, టీవీ టవర్ ప్రాంతానికి చెందిన సాలోమన్, తపోవనంలో నివాసముంటున్న జ్యోతుల ప్రవీణ్‌కుమార్, కళ్యాణదుర్గం బైపాస్ ప్రాంతానికి చెందిన దినేష్‌గౌడ్, బెళుగుప్పకు చెందిన మనోజ్‌కుమార్ ఉన్నారు. వీరి నుంచి 4.5 కిలోల గంజాయి, 8 సెల్‌ఫోన్లు, రూ. 2,700 నగదు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కురుగుంటకు చెందిన హాజీ రహమత్ అలియాస్ బువమ్మతో కలసి మనోజ్‌కుమార్, షేక్ అస్లాంబాషా ఇటీవల విశాఖపట్నం జిల్లా తునికి వెళ్లి అక్కడ ఓ వ్యక్తి నుంచి కిలో రూ. 5వేలు చొప్పున 10 కిలోల గంజాయిని కొనుగోలు చేసి అక్రమంగా రైలులో అనంతపురానికి తీసుకువచ్చారు. ఇందులో నాలుగు కిలోల గంజాయిని కర్ణాటకలోని బాగేపల్లిలో విక్రయించారు. 100 గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టి నగర పరిసరాల్లో ప్యాకెట్ రూ.2 వేలు చొప్పున విక్రయించేందుకు చూస్తుండగా పక్కా సమాచారంతో అరెస్ట్ చేసినట్లు సీఐ వివరించారు.
సైన్స్ సెంటర్‌లో
నేటి నుంచి శిక్షణ
అనంతపురం సిటీ: జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యం పరిధిలోని అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, ల్యాబ్ ఇన్‌చార్జ్ ఉపాధ్యాయులకు బుధవారం నుంచి అనంతపురంలోని సైన్స్ సెంటర్‌లో శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు సైన్స్ సెంటర్ జిల్లా అధికారి బాలమురళీకృష్ణ మంగళవారం తెలిపారు. మూడు రోజుల శిక్షణ తరగతులను డీఈఓ ప్రసాద్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని వివరించారు. అటల్ టింకరింగ్‌కు సంబంధించి ల్యాబ్ నిర్వహణ, నిధుల వినియోగం, ప్రాజెక్టుల తయారీ, రికార్డుల నిర్వహణ వంటి అన్ని అంశాలపై నిపుణులు శిక్షణ ఇస్తారని వెల్లడించారు.
నక్కకు చికిత్స
నక్కకు చికిత్స
నక్కకు చికిత్స


