ఎకోరియన్ చెస్ చాంపియన్‌గా సహృద్
ధర్మవరం అర్బన్: ఎకోరియన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ చాంపియన్‌షిప్‌ను ధర్మవరం విద్యార్థి సహృద్ దక్కించుకున్నాడని స్థానిక బీఎస్‌కే చెస్ అకాడమీ చీఫ్ కోచ్ ఆది రత్నకుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం వివరాలు వెల్లడించారు. ఈ నెల 24న విజయవాడలో అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఎకోరెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 595 మంది క్రీడాకారులు పాల్గొనగా, 1800 లోపు రేటింగ్ విభాగంలో సహృద్ 9 రౌండ్లకు 8 రౌండ్లు గెలిచి టైటిల్‌ను కై వసం చేసుకున్నాడన్నారు.
పాముకాటుతో యువరైతు మృతి
పుట్లూరు: మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన యువరైతు యలగాని ప్రతాప్ (30) పాముకాటుతో మృతిచెందాడు. గ్రామ సమీపంలో ఉన్న పత్తి పొలానికి నీరు పెట్టడానికి మంగళవారం ఉదయం వెళ్లిన సమయంలో పాము కాటుకు గురయ్యాడు. విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య శరణ్య, ఐదు నెలల కుమార్తె ఉంది. కాగా, భర్త మృతిపై శరణ్య అనుమానాలు వ్యక్తంచేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వివాహిత బలవన్మరణం
పెద్దపప్పూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన అనిత (30)కు ఎనిమిదేళ్ల క్రితం పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన మంగల శ్రీరాములుతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని నెలల క్రితం దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకోడంతో అనిత పుట్టింటికి చేరుకుంది. ఆ సమయంలో పెద్దలు పంచాయితీ చేసి సర్దిచెప్పడంతో తిరిగి భర్త వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో భర్త వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో జీవితంపై విరక్తి చెందిన అనిత.. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చిన్నారుల ఏడుపులను విన్న స్థానికులు ఇంటి తలుపులు తెరిచి చూడడంతో విషయం వెలుగు చూసింది. కాగా, అప్పటికే భర్త, అత్తమామలు పరారయ్యారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎకోరియన్ చెస్ చాంపియన్‌గా సహృద్


