ప్రైవేటీకరణతో వైద్యవిద్య అందనిద్రాక్షే
గోరంట్ల: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే పేదలకు వైద్య విద్య ఇక అందనిద్రాక్షే అవుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుయాయులకు లబ్ధిచేకూర్చేందు కోసమే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మంగళవారం మల్లాపల్లి పంచాయతీ కళ్లగేరిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ పేదలకు వైద్యవిద్య, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవాలన్న ముందుచూపుతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు మంజూరు చేయించారన్నారు. ఇందులో కొన్ని పూర్తిచేసి తరగతులు ప్రారంభించారన్నారు. మిగిలిన కళాశాలల నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే జగన్‌కు ఆ క్రెడిట్ ఎక్కడ దక్కుతుందోనని ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కసు పెంచుకున్నారన్నారు. అందులో భాగంగానే పీపీపీ విధానం పేరిట ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని, అదీ తనకు కావలసిన వారికి ఆదాయవనరుగా మార్చడానికి తహతహలాడుతున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించే విధంగా ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ ఆందోళనలను ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో ‘రచ్చబండ’ నిర్వహించి కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఆవిష్కరించారు. తర్వాత ప్రతి ఇంటికీ వెళ్లి మెడికల్ కాలేజీలపై జరుగుతున్న కుట్రను వివరించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ వెంకటేశు, జిల్లా ఉపాధ్యక్షుడు రఘురామిరెడ్డి, ట్రెజరర్ బాలన్నగారిపల్లి రామకష్ణారెడ్డి, పంచాయతీ కన్వీనర్ కరాల రామకష్ణారెడ్డి, నియోజకవర్గ రైతువిభాగం అధ్యక్షుడు గంగిరెడ్డి, పార్టీ మండల ముఖ్యనాయకులు, పంచాయతీ ప్రముఖులు పాల్గొన్నారు.
మంత్రి ఓఎస్‌డీపై ఉషశ్రీచరణ్ ఆగ్రహం
మంత్రి సవితకు ఓఎస్‌డీగా ఉన్న సుమన జయంతి తన పరిధి దాటి నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ ఉద్యోగులతో సమీక్షిలు నిర్వహించి, సచివాలయ ఉద్యోగులతో పాటు కార్యదర్శులను బెదిరించడంపై ఉషశ్రీచరణ్ ఫైర్ అయ్యారు. మంత్రితో సంబంధం లేకుండా ఆమె ఏ హోదాలో సమీక్షలు నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. ఆమె వ్యవహారశైలిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే న్యాయపోరాటం చేయడానికీ సిద్ధమని స్పష్టం చేశారు.
ప్రైవేటీకరణ ఆపే వరకు ఉద్యమం కొనసాగిస్తాం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్


