రాజ్యాంగం ఔన్నత్యం తెలుసుకోవాలి
ప్రశాంతి నిలయం: ప్రభుత్వ అధికారులు, ప్రజలు భారత రాజ్యాంగం ఔన్నత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం 11.30 గంటలకు అన్ని కార్యాలయాలలో రాజ్యాంగ ప్రస్తావనను సామూహికంగా చదవాలని సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంవిధాన దినోత్సవాన్ని ప్రతి ప్రభుత్వ కార్యాలయం, సంస్థల్లో తగిన గౌరవంతో నిర్వహించాలన్నారు. రాజ్యాంగ విలువలపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు.
లింగ సమానత్వంపై
అవగాహన పెంచుకోవాలి
ప్రశాంతి నిలయం: లింగ సమానత్వంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 25 వరకు నిర్వహించే ‘జెండర్ అవేర్‌నెస్’ కార్యక్రమ పోస్టర్లను మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో కలసి జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జెండర్ అవేర్‌నెస్ ప్రచారాన్ని పంచాయతీ రాజ్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా విద్యా శాఖ , డీఆర్‌డీఏ సంయుక్తంగా సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. సమాజంలో మహిళల స్థానం బలోపేతం చేయడం, వివక్ష తగ్గించడం, సమాన హక్కులు, సమాన అవకాశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. లింగ సమానత్వం, మహిళా భద్రత, స్వావలంబన, న్యాయం, గౌరవం వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీఈఓ క్రిష్టప్ప, ఐసీడీఎస్ అధికారి గాయత్రి, డీఆర్‌డీఏ ఏపీఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మడకశిర రెవెన్యూ డివిజన్‌కు గ్రీన్‌సిగ్నల్
మడకశిర: పరిపాలనా సౌలభ్యం కోసం మడకశిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రస్తుతం మడకశిర నియోజకవర్గంలోని మడకశిర, అగళి, రొళ్ళ, అమరాపురం, గుడిబండ మండలాలు 80 కిలోమీటర్ల దూరంలోని పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాయి. ఏదైనా అవసరం పడితే ప్రజలు అంత దూరం వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. ఈ మండలాలన్నీ ఇక మడకశిర రెవెన్యూ డివిజన్ పరిధిలోకి రానున్నాయి. ఇదివరకే కలెక్టర్ శ్యాంప్రసాద్ మడకశిరలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భవనాన్ని కూడా పరిశీలించారు.


