స్వస్థలాలకు పయనం
పుట్టపర్తి అర్బన్: భగవాన్ సత్యసాయిబా శతజయంతి వేడుకలు దిగ్విజయంగా ముగిశాయి. వేడుకలు తిలకించేందుకు, స్వచ్ఛందంగా సేవ చేసేందుకు దేశం నలుమూలల నుంచి పుట్టపర్తికి తరలివచ్చిన భక్తులు లగేజీలు సర్దుకుని స్వస్థలాలకు పయనమయ్యారు. దాదాపు రెండు లక్షల మంది సేవాదళ్ సభ్యులు షెడ్లు ఖాళీ చేశారు. ఇక వివిధ క్యాంపస్‌ల నుంచి విచ్చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సొంతూళ్లకు వెళ్లారు. ఉత్సవాలు ముగిసినా ఇప్పటికీ ప్రశాంతి నిలయం భక్తులతో సందడిగానే ఉంది. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్‌లో స్టాల్స్ ఖాళీ చేశారు. భక్తులంతా ఒక్కసారిగా వాహనాల్లో తిరుగుపయనమవడంతో ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. ప్రశాంతి నిలయం నుంచి ఆర్టీసీ బస్టాండు, గోకులం, కలెక్టరేట్ మీదుగా గణేష్ సర్కిల్ వరకు వెళ్లడానికి అరగంటకు పైగా సమయం పట్టింది. వాహనాలతో పాటు ఆటోలు, ఆర్టీసీ బస్సులు, కర్ణాటక ఆర్టీసీ బస్సులు ఒకే రహదారిపైకి రావడం, ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో రాకపోకలకు కాస్త ఇబ్బందిపడాల్సి వచ్చింది. సేవాదళ్ సిబ్బందికి, భక్తులకు మంగళవారం సైతం రైల్వే స్టేషన్ వరకూ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు.
ముగిసిన సత్యసాయి శతజయంతి వేడుకలు
పుట్టపర్తి నుంచి ఇళ్లకు బయల్దేరిన భక్తులు
వాహనాలతో కిక్కిరిసిపోతున్న ప్రధాన రహదారి
స్వస్థలాలకు పయనం


