ప్రేమమూర్తి.. నిత్యస్ఫూర్తి
స్వర్ణరథంపై ఊరేగుతున్న సత్యసాయిబాబా
ప్రశాంతి నిలయం: దేహం నిండుగా సాయి తత్వాన్ని నింపుకుని ఇలవేల్పు సత్యసాయికి అశేష భక్తకోటి ‘సాయిరాం’ అంటూ శతసహస్ర వందనాలు తెలపగా.. వేడుకలకు హాజరైన అతిరథ మహారథులు సాయిభక్తుల సంకల్పాన్ని చూసి అచ్చెరువొందగా.. పుట్టపర్తి వేదికగా హిల్‌వ్యూ స్టేడియంలో జరిగిన సత్యసాయి శతవర్ష జయంతి వేడుకలు ఓ విశ్వవేడుకను తలపించాయి. ఇసుకవేస్తే రాలనంతగా స్టేడియం నిండిపోయింది. ఉదయం నుంచే భక్తులు హిల్‌వ్యూ స్టేడియానికి క్యూ కట్టారు. ఆదివారం ఉదయం 9 గంటలకు సత్యసాయి స్వర్ణ రథోత్సవంతో శత వర్ష జయంతి వేడుకలు ప్రారంభించారు. ప్రశాంతి నిలయం నుంచి స్వర్ణరథంపై సత్యసాయే భౌతికంగా ఆశీనులయ్యారా అనిపించేలా ఏర్పాటు చేసిన చిత్రపటాన్ని కొలువుదీర్చి ఊరేగించారు. హిల్‌వ్యూ స్టేడియం వేదిక వరకు స్వర్ణ రథోత్సవం సాగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల సత్యసాయి సేవా సంస్థల సభ్యులు, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్‌కు చెందిన ఆయా దేశాల సభ్యులు సత్యసాయి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ బాబా బోధనలను, మానవతా విలువలను, వారివారి ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనతో ముందు నడవగా.. వెనుక వేదపండితుల వేదఘోష.. ఆ వెనుక సత్యసాయి స్వర్ణ రథం కదిలింది. స్వర్ణ రథం మైదానంలోకి అడుగిడగానే భక్తులు అధ్యాత్మిక పరవశంతో ‘ఓం సాయిరాం, జై సాయిరాం’ అంటూ నినదించారు.
సేవకు ప్రతిరూపం సత్యసాయి
సత్యసాయి బాబా అహింస, ప్రేమ, నిస్వార్థ సేవలకు ప్రతిరూపమని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. ‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్’, ‘హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్’’ అన్న సత్యసాయి నినాదాలు కోట్లాది హృదయాలను సేవ వైపు కదిలించాయన్నారు. అంతకుముందు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు ప్రారంభోపన్యాసం చేశారు. సత్యసాయి కారణ జన్ముడని, పుట్టపర్తిలో పుట్టి తన జీవనయాత్రను ప్రారంభించి.. ఇక్కడే నిర్యాణం పొందారని, తన జననానికి, కర్మలను ఆచరించేందుకు పుట్టపర్తినే ఎంచుకోవడం ఈ ప్రాంత విశిష్టతను తెలియజేస్తుందన్నారు. త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ సత్యసాయి బాబా మానవాళి శ్రేయస్సు కోసం ఏడు దశాబ్దాల క్రితం స్థాపించిన సత్యసాయి ట్రస్ట్ నేడు ప్రపంచ వ్యాప్తంగా సేవా ఉద్యమంగా మారిందన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సత్యసాయి అవతార పురుషుడని, మానవతా విలువలను, ఆధ్యాత్మిక చింతనను బోధిస్తూ నూతన అధ్యాయం లిఖించారని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలలో దేవుడిని చూస్తూ.. మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించిన మహానుభావుడు సత్యసాయి అని అభివర్ణించారు. వేడుకలలో భాగంగా తమిళనాడు, కర్ణాటక బాలవికాస్ చిన్నారులు మానవతా విలువలను చాటుతూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో మైమరిపించారు. సాయంత్రం వేడుకల్లో భాగంగా సత్యసాయి జోలోత్సవం నిర్వహించారు. ‘ది ఎటర్నల్ సింపోనీ ఆఫ్ సెల్ఫ్‌లెస్ లవ్’ పేరుతో ఆర్కెస్టా నిర్వహించారు. అనంతరం డ్రోన్ షో, లేజర్ షో ఆకట్టుకున్నాయి.
ఘనంగా సత్యసాయి శత వర్ష జయంతి
పుట్టపర్తిలో అంబరమంటిన సంబరం
సత్యసాయి నామస్మరణతో పులకించిన భక్తజనం
ప్రేమమూర్తి.. నిత్యస్ఫూర్తి
ప్రేమమూర్తి.. నిత్యస్ఫూర్తి


