‘మాక్ అసెంబ్లీ’ ఎంపికలో గందరగోళం
తాడిపత్రిటౌన్: రాష్ట్ర విద్యాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మాక్ అసెంబ్లీ’ విద్యార్థుల ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారింది. మూడు రోజలు క్రితం మాక్ అసెంబ్లీకి తాడిపత్రి పట్టణానికి చెందిన ప్రకాశం హైస్కూల్‌లో 9వతరగతి చదువుతున్న నాగమల్లికార్జునను అధికారులు ఎంపిక చేశారు. అయితే శనివారం ఉన్నఫలంగా యాడికి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అనిల్‌కుమార్‌ను మాక్ అసెంబ్లీకి పంపుతున్నట్లు అధికారులు ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన నాగమల్లికార్జునను కాదని తృతీయస్థానంలో నిలిచిన అనిల్‌కుమార్‌ను ఎలా ఎంపిక చేస్తారని నాగమల్లికార్జున తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎంఈఓ నాగరాజును ‘సాక్షి’ వివరణ కోరగా విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు.
కణేకల్లు: మాక్ అసెంబ్లీ ఎంపికకు రాయదుర్గం పట్టణంలో వ్యాసరచన, వకృత్వపోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో యర్రగుంట జెడ్పీ హైస్కూల్‌కు చెందిన హేమలత మొదటి బహుమతి సాధించింది. ఈమెను నవంబర్ 26న అమరావతిలో జరగనున్న రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీకి ఎంపిక చేశారు. ఆదివారం అమరావతికి హేమలత బయలుదేరాల్సిన సమయంలో విద్యాశాఖ అధికారులు పేరును తారు మారు చేశారు. హేమలతకు బదులు రెండోస్థానంలో ఉన్న లింగదాళ్‌కు చెందిన గంగోత్రిని ఎంపిక చేశారు. దీంతో పోటీల్లో టాపర్‌గా నిలిచిన హేమలత కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారడంతో విద్యాశాఖ అధికారులు కంగుతిన్నారు.
నాగ మల్లికార్జున హేమలత
‘మాక్ అసెంబ్లీ’ ఎంపికలో గందరగోళం


